HomeతెలంగాణTelangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న యువత.. గెలుపోటములు వారి చేతిలోనే..

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న యువత.. గెలుపోటములు వారి చేతిలోనే..

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ప్రజలు తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. పోలింగ్ మొదలైంది. ఈసారి 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో యువత కీలకంగా మారనుంది. గెలుపోటములను ప్రభావం చేసేది కూడా వారే. యువత మెచ్చిన వారినే విజయం వరించనుంది.

రాజకీయాలపై భిన్న అభిప్రాయాలు..
సమకాలీన రాజకీయ పరిణామాలపై యువతది భిన్నమైన విశ్లేషణ. ఓటు హక్కు వినియోగించుకోవడంలో వారి భావోద్వేగాలు, ప్రభావితం అయ్యే, ప్రలోభాలకు లోనయ్యే స్థాయిలు వేరే వేరుగా ఉంటాయి. ప్రశ్నించేతత్వం, ఉడుకు రక్తం, సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకునే యువత ఓటు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. అందులోనూ కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు నియోజకవర్గానికి దాదాపు ఐదువేల మంది ఉన్నారు. అందుకే ప్రధాన రాజకీయపార్టీలు వారి చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాయి. రాజకీయాలను శాసించే స్థాయిలో యువత ఓటు బ్యాంకు దండిగానే ఉంటుంది. 18 ఏళ్ల కొత్త ఓటరు మొదలు, రెండు మూడు సార్లు ఓటు వేసిన 39 ఏళ్లలోపు వారి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగానే ఉంది.

భవిష్యత్తు నిర్ణేతలు
ఒక్కో నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు సగటున ఐదువేల మంది ఉండటంతో వీరందరినీ ఓటు బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం అన్ని పార్టీలు చేశాయి. నిర్ణేతలుగా యువతరం మారుతుండడం సరికొత్త పరిణామం. దీంతో అన్ని పార్టీలు, ఆ పార్టీలకు చెందిన నాయకుల దృష్టంతా యువతపైనే ప్రధానంగా కేంద్రీకృతమై ఉంటుంది. వీరిని ఆకట్టుకునే వ్యూహాలను బట్టి వారి గెలుపోటములు నిర్ణయమవుతాయి. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వారు వదులుకోవడం లేదు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న యువతీ యువకుల చిరునామాలను సేకరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈనేపథ్యంలో యువ ఓటర్ల చూపు ఎటు వైపు ఉండబోతోందనే విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

గెలుపోటములు వారి చేతుల్లోనే .
ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపితే గెలుపు ఆ వైపే ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్తాల్లో సుమారు 10వేల మంది పైగానే కొత్త ఓటర్లు ఉన్నారు. వీరంతా 100 శాతం పోలింగ్‌లో పాల్గొంటే వారే గెలుపు నిర్ణేతలుగా మారనున్నారు. అందుకే తొలుత క్రికెట్‌ కిట్లను బహుమతులుగా ఇచ్చారు. మీతో పాటు మీ స్నేహితులు, సోదరులు, పెద్దవారితో ఓట్లు వేయిస్తే ఒక్కో ఓటుకు రూ.500ల నుంచి రూ.వెయ్యి ఇస్తామని, ఓటు వేసేవారికి కూడా కానుకలు ఇస్తామంటున్నారు.

ఓటేస్తారా..?
గణాంకాల్లో యువ ఓట్లర్ల హవా ఘనంగానే కనిపిస్తున్నా ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో అనుకున్న విధంగా జోష్‌ ఉండడం లేదనేది గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈసారి రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 ఓటర్లు ఉండగా.. అందులో 9,99,667 ఓట్లు యువతవే ఉన్నాయి. అందులో అబ్బాయిలు 5,70,274 ఉండగా.. మహిళలు 4,29,273 ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 120 మంది ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు వరుసలో గంటల తరబడి నిరీక్షించి ఓటు హక్కును వినియోగించడానికి ఆసక్తిని చూపిస్తే.. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు కొంతమంది యువకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇతర ప్రాంతాల్లో చదువుతుండడం, ఉద్యోగాలు చేస్తుండడంతో పాటు తను ఒక్కడిని వేయకుంటే ఏమౌతుందిలే అన్న నిర్లిప్తతతతో చాలామంది పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం లేదు.

నిరుద్యోగుల్లో ఫెయిర్..
ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లు చాలా వరకు ఓటు వేసే అవకాశం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో పదేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీ జరగ లేదు. నోటిఫికేషన్లు వెలువడ లేదు. గ్రూప్-1… గ్రూప్ 2, పేపర్ లీకేజీలు, ఉద్యోగాల అమ్మకం వంటి అంశాలతో యువత చాలా ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version