Mahbubabad: తెలంగాణ రైతులు యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి నాట్లు విస్తారంగా వేశారు. ప్రస్తుతం ఆ పంటకు యూరియా వేయాల్సిన అవసరం ఉంది. వరి విస్తీర్ణం పెరగడంతో యూరియాకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. పైనుంచి సప్లై కూడా తక్కువగా ఉండడంతో విపత్కర పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ కు సప్లై కి విపరీతమైన అంతరం ఉండడంతో రైతులు పడి గాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా యూరియా పంపిణీలో స్థానికంగా ఉండే అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో రైతులు నరకం చూస్తున్నారు.
ఆందోళనకు దిగారు
యూరియా సరిపడా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ఆందోళనలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైనుంచి సప్లై లేదని.. అందువల్లే రైతులకు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నామని చెబుతోంది. సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది . కావలసినంత యూరియా సరఫరా చేస్తామని కేంద్ర పెద్దలు చెప్తున్నారు. కానీ వాస్తవంలో మాత్రం అది కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు యూరియా కొరత ఉన్న విషయం వాస్తవమేనని బిజెపి నాయకులు ఒప్పుకుంటున్నారు. కానీ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మాత్రం కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది. గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా అయితే తెలంగాణలో మొదటిసారి యూరియా కొరత ఏర్పడినట్టుగా వార్తలను ప్రసారం చేస్తోంది. వీడియోలను పెడుతోంది.
జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు
ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత అధికంగా ఉంది. ఇక్కడ ఈ ఏడాది వరి సాగు విపరీతంగా పెరిగింది. వరి కి యూరియా కావలసి రావడంతో రైతులు పిఎసిఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునే పిఎసిఎస్ కేంద్రాల దగ్గరికి వచ్చి ఎదురుచూస్తున్నారు. ఆధార్ జిరాక్స్ లు ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. గురువారం మహబూబాబాద్ లోని ఓ షాపులో రైతులు ఆందోళనకు దిగారు. రాళ్లు రువ్వారు. గోదాం కు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన మర్చిపోకముందే శుక్రవారం అక్కడ యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రైతుల సంఖ్యకు తగ్గట్టుగా బస్తాలు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. అయితే ఇద్దరు మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా.. యూరియా ఆశించిన స్థాయిలో సప్లై కాకపోవడంతో ఇదంతా జరుగుతోందని.. దీనంతటికీ కేంద్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులు ఇలా ఉన్నప్పటికీ యూరియా లభించక రైతులు మాత్రం ఇలా వీధుల్లో కొట్టుకుంటున్నారు.
యూరియా కేంద్రం వద్ద జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ
దీంతో నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని, చెప్పులతో కొట్టుకున్న మహిళలు pic.twitter.com/nZbGSQWppN
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025