Telangana Municipal Polls: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపింది. కనివిని ఎరుగని స్థాయిలో స్థానాలను సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి గులాబీ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించలేదు. సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకున్నప్పటికీ.. గులాబీ పార్టీ చెప్పుకునే స్థాయిలో మాత్రమే స్థానాలను సంపాదించుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో 0 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ.. పంచాయతీ ఎన్నికల్లో కాస్త బెటర్ పెర్ఫార్మన్స్ కనపరిచింది.
పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహం నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం పురపాలక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 117 మున్సిపాలిటీలు.. ఆరు కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఐదున మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పదవ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,996 వార్డుల ఓటర్ల జాబితా ఎన్నికల సంఘానికి చేరుకుంది. అంతేకాదు మంగళవారం మున్సిపాలిటీల వారిగా పోలీస్ స్టేషన్ల పేర్లను కూడా ప్రకటించింది. జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించి.. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తుంది.
2019 మున్సిపల్ ఆక్ట్ ప్రకారం ఎన్నికల నిర్వహించబోతున్నారు. 2025 అక్టోబర్ 1 నాటికి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా నమోదు చేసిన ఓటర్ల జాబితాను అనుసరించి.. పురపాలకాలు, నగర పాలకాలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు.. ఇతర కార్పొరేషన్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక శాఖ పరిధిలో ఉన్న 124 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి ఫిబ్రవరి వరకు గడువు ఉంది. ఖమ్మం, వరంగల్ నగర పాలకాలు, నకిరేకల్, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు వంటి మున్సిపాలిటీలకు ఫిబ్రవరి వరకు పాలకవర్గాలకు గడువు ఉంది.
పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సత్తా చూపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందువల్లే ఆయా పురపాలకాల పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. కీలకమైన నాయకులను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. మరోవైపు గులాబీ పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.. ఇక పంచాయతీ ఎన్నికల్లో కమలం పార్టీ తన స్థాయికి తగ్గట్టుగా ఫలితాలు అందుకోలేకపోయినప్పటికీ.. పురపాలకాలలో సత్తా చూపించాలని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి సత్తా చూపించింది. అయితే ఈసారి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరింత విస్తరించిన నేపథ్యంలో. మెరుగైన ఫలితాలు సాధించాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు.