Ravi Prakash: ఇవి కొంచెం డిబేటబుల్ ప్రశ్నలు.. అసలు తెలుగునాట మీడియాకు ఒక క్రెడిబిలిటీ ఉందా? ప్రసారం చేసే కథనం, ప్రచురించే వార్త నిస్పాక్షమేనా? మీడియా అధిపతులు గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేయడం లేదా? నచ్చని వాళ్ళ మీద బురద చల్లడం లేదా? ఇందులో ఎవరూ శుద్ధ పూసలు కాదు. కాకపోతే వాళ్ల దాకా వస్తే గాని బాధ తీవ్రత అర్థం కాదు.
“బాధించేవాడు గొప్ప భావనను పొందినప్పుడు.. బాధపడ్డవాడు కన్నీటిని స్వీకరిస్తాడు” ఓ పర్షియన్ సామెతకు తెలుగు అనువాదం ఇది. మన పరిభాషలో చెప్పుకోవాలంటే అధికారం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు ఒకరకంగా ఉంటుంది. అదేవారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వల్లె వేసే ప్రజాస్వామ్య విలువలు మరో విధంగా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అనుసరిస్తున్న విధానం ఇలానే ఉంది. భారత రాష్ట్ర సమితికి నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ టుడే పేరుతో అధికారిక పత్రికలు, ఛానల్ ఉన్నాయి. ఇక యూట్యూబ్ చానల్స్, పీడీఎఫ్ పేపర్లకు లెక్కే లేదు. ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్.. ఇందులో చూసుకుంటే చాంతాడంత జాబితా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వీటి ద్వారా భారత రాష్ట్ర సమితి స్వ భజన చేసుకుంది. గిట్టని వాళ్ళ మీద అడ్డగోలుగా రాళ్లు వేసింది. నచ్చని వాళ్ళ మీద ఇష్టానుసారంగా బురద చల్లింది. అప్పట్లో ఇది భారత రాష్ట్ర సమితికి గొప్పగా అనిపించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇలానే ఉంటుందని గోచరించింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు బాధిత పక్షంగా కాంగ్రెస్ పార్టీ, బిజెపి ఉన్నాయి. కొన్నిసార్లు బిజెపి, మరికొన్నిసార్లు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి చేతిలో రకరకాల వేధింపులను చవిచూసాయి. పదేళ్లపాటు ఇది ఏకచత్రాధిపత్యంగా సాగింది. ఆ తర్వాత కాలం మారింది. అధికారం పోయింది.
అధికారం పోయిన నాటి నుంచి..
అధికారం పోయిన నాటి నుంచి భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా ప్రజాస్వామ్య విలువలు గల పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ నాయకులు పదేపదే ప్రజాస్వామ్యం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో గతంలో భారత రాష్ట్ర సమితి ద్వారా బాధిత పక్షంగా ఉన్నవారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ఫినిక్స్ పక్షి లాగా బలాన్ని సంతరించుకున్నారు. అందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈ జాబితాలో రవి ప్రకాష్ ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రవి ప్రకాష్ ని కలిపిన టీవీ9 ను ఆయన చేతిలో నుంచి తన అనుకూలమైన వారికి గత ప్రభుత్వ పెద్దలు దర్జాగా ఇప్పించారు. రవి ప్రకాష్ ను మెడపట్టి బయటికి గెంటేశారు. ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టాలో.. ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టారు. వాటన్నింటినీ రవిప్రకాష్ తట్టుకున్నాడు. ఒకప్పుడు రవి ప్రకాష్ కూడా గత అధికార పార్టీతో అంట కాగిన వాడే. ఆ తర్వాతే తేడా వచ్చి దూరం జరిగాడు.
తన చేతి నుంచి దూరం చేసిన తర్వాత..
తాను పెంచిన, శాఖోపశాఖలుగా విస్తరించిన టీవీ9 ను తన నుంచి దూరం చేయడంతో రవి ప్రకాష్ కు మండిపోతోంది. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఎంతోకొంత బలం కూడా తీసుకుని ఆర్ టీవీ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. తన మార్క్ జర్నలిజాన్ని రుచి చూపించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారిగా మెఘా కంపెనీ మీద పడ్డాడు. దొంగ బ్యాంకు షూరిటీ మీద సంచలన కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టాడు. ఇవి చర్చకు దారి తీయడంతో రవి ప్రకాష్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇంకేముంది భారత రాష్ట్ర సమితి మీద పడ్డాడు. తన టీం తో తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేయించి.. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి రాదని తేల్చిపడేశాడు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పాడు. యాదృచ్ఛికంగా అతడు చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. దీంతో గులాబీ క్యాంప్ అతని మీద ఆగ్రహం మొదలుపెట్టింది. తమ సోషల్ మీడియా ఖాతాలలో రవి ప్రకాష్ ను బద్నాం చేయడం ప్రారంభించింది. ఆయనప్పటికీ వెనకడుగు వేయని రవి ప్రకాష్ ఈసారి భారత రాష్ట్ర సమితి, బిజెపిలో విలీనం అవుతుందని బాంబు పేల్చాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జోరు అందుకుంటుందని స్పష్టం చేశాడు. ఇంకేముంది భారత రాష్ట్ర సమితి రవి ప్రకాష్ మీద అగ్గిమీద గుగ్గిలమైంది. బిజెపి నాయకులు కూడా ఈ వార్తను ఖండించారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం తెగ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. రవి ప్రకాష్ కు కూడా కావాల్సింది అదే కదా.. అయితే ఈ వార్తను తన ట్విట్టర్ లో లింక్ చేశాడు రవి ప్రకాష్. అయితే ట్విట్టర్ యాజమాన్యం రవి ప్రకాష్ ఖాతాను కొద్ది గంటల వరకు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఖాతాను పునరుద్ధరించింది. అయితే ఈ కథనం భారత రాష్ట్ర సమితికి తీవ్రమైన డ్యామేజీ చేస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ అధినాయకత్వం అలర్ట్ అయింది. రవి ప్రకాష్ కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ కథనాన్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే రవి ప్రకాష్ ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లీగల్ నోటీసులకు భయపడిపోతాడా..
భారత రాష్ట్ర సమితి కి డ్యామేజీ జరిగింది కాబట్టి లీగల్ నోటీసులు ఇచ్చింది.. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద, భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ మీద, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిరాధారమైన కథనాలను నమస్తే తెలంగాణ ప్రచురించింది. టీ న్యూస్ ప్రసారం చేసింది.. అంటే అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి భారత రాష్ట్ర సమితి తన మీడియా ద్వారా ఎలాంటి ప్రచారమైన చేయవచ్చు. దానికి ఎటువంటి లీగల్ నోటీసులు పంపించకూడదు. కానీ ఇప్పుడు భారత రాష్ట్ర కమిటీ బాధిత పక్షంగా మారిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. దీన్నే కర్మ రిటర్న్ బ్యాక్ అంటారేమో..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Will ravi prakash be intimidated if brs gives legal notices
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com