KTR: గత బీఆర్‌ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్(ఓఖీఖ) హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశీ సంస్థకు రూ.56 కోట్లు కేబినెట్ అనుమతి లేకుండా కేటాయించారు. ఈ విషయాన్ని ఆయన కూడా మీడియా ముఖంగా అంగీకరించారు. అయితే విదేశీ సంస్థకు ఎలాంటి అనుమతి లేకుండా రూ.56 కోట్లు కేటాయించడంపై రిజర్వు బ్యాంకు అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ.8 కోట్ల జరిమానా విధించింది. దీంతో ప్రాథమిక విచారణ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలు జరిగినట్లు గుర్తించి కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ రాసింది. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ తర్వాత హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది. దీంతో ఇప్పుడు కేటీఆర్ విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇదే క్రమంలో తన వెంట లాయర్‌ను అనుమతించాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం లాయర్‌ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు వెళ్లాలని కూడా సూచించింది.
10 గంటలకు ఏసీబీ ఆఫీస్‌కు..
ఏసీబీ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు భారీగా నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి వచ్చారు. కేటీఆర్ భార్య, తల్లితో మాట్లాడారు, చెల్లి కవిత, బావ అనిల్‌కుమార్‌తోనూ మాట్లాడారు. అంతకు ముందు న్యాయ నిపుణులతో గంటన్నరపాటు చర్చలు జరిపారు. కేటీఆర్‌ను విచారణ తర్వాత అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతలు కేటీఆర్ ఇంటికి తరలివచ్చారు.
హరీశ్‌రావు హౌస్ అరెస్ట్..
ఇదిలా ఉంటే మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన వస్తే పరిస్థితులు ఉద్రికక్తతగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరు ముఖ్య నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇక కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీస్‌కు మాజీ అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు వెళ్లనున్నారు. కోర్టు అనుమతితో ఆయన ఏసీబీ ఆఫీస్‌కు వెళ్తారు. అయితే ఆయన విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోలేరు. విచారణ కనిపించే దూరంలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.
గ్రీన్ ఛానెల్ ద్వారా..
కేటీఆర్ విచారణకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి గొడవ జరగకుండా పోలీసులు నందినగర్ నుంచిఏసీబీ ఆఫీస్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రోడ్లపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో ఐదు నిమిషాల్లో ఆయన ఏసీబీ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు రావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. దీంతో 9:55 గంటలకు ఆయన ఆఫీస్‌కు బయల్దేరారు.