Bandi Sanjay : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చి నిత్యం చర్చల్లో ఉండేలా చేసిన బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ సాగుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారతీయ జనతా పార్టీ లోని కొంతమంది పెద్దలే బండి సంజయ్ ని తొలగించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.”భారతీయ జనతా పార్టీలో చేరాలి అనుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరేందుకు బండి సంజయే కారణమని చేసిన ప్రచారమే ఆయన తొలగింపునకు ప్రధాన కారణం. నిజానికి పొంగులేటి, జూపల్లి తో బిజెపి తరఫున జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ఎంపీ నిశికాంత్ చర్చలు జరుపుతున్నారు. మేము కాంగ్రెస్ లో చేరేందుకు సంజయ్ కారణం కాదని వారు దూబేకు చెప్పారు. అయితే ఈ విషయం బిజెపి పెద్దలకు చాలా ఆలస్యంగా తెలిసింది. పొంగులేటిని, జూపల్లిని భారతీయ జనతా పార్టీలో చేరకుండా బయట నుంచి పార్టీలోకి వచ్చిన నేతలే ఆపారు. పార్టీలో మాకే దిక్కులేదు. మీరెందుకు చేరుతారు అంటూ వారిని వెనక్కి తగ్గేలా చేశారు” అని భారతీయ జనతా పార్టీ చెందిన కొంత మంది నాయకులు చెబుతున్నారు.
అయితే బండి సంజయ్ మీద ఆరు నెలలుగా కుట్రపూరితంగా వ్యతిరేక ప్రచారం చేసేందుకు, ఈటల రాజేందర్ వంటి వారిని తనపై ఉసిగొల్పేందుకు ఢిల్లీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక నేత కారణమని తెలుస్తోంది. ఈటెల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పితేనే పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వస్తారంటూ నివేదికలు పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. విజయవంతంగా సాగుతున్న బండి సంజయ్ పాదయాత్రను అధిష్టానం ఆపేందుకు కూడా తెర వెనుక ఆ నాయకుడు కుట్ర చేశారని భారతీయ జనతా పార్టీలోని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. భారత రాష్ట్ర సమితి సదరు నాయకుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక పద్ధతి ప్రకారం దెబ్బతీశారని సదరు నాయకులు వాపోతున్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బండి సంజయ్ మీద అభిమానం ఉన్నప్పటికీ అమిత్ షా, బి ఎల్ సంతోష్ కుమార్, సునీల్ బన్సల్ వంటి నేతల ద్వారా తప్పుడు సమాచారం పంపడం వల్ల బండి సంజయ్ భవిష్యత్తు ఆగమైందని వారు అంటున్నారు.
అంతేకాదు నిన్నటి వరకు సాహో సంజయ్ అంటూ భుజం తట్టిన భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు అవమానకర రీతిలో తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా సమయంలో బాధ్యతలు చేపట్టి భారత రాష్ట్ర సమితి తో ఢీ అంటే ఢీ అన్నట్టు పార్టీని విస్తరించిన బండి సంజయ్ ని మార్చడం ద్వారా తెలంగాణలో పూడ్చలేని అపఖ్యాతిని మూటగట్టుకుందని వాపోతున్నారు. సభలు జరిగినప్పుడు సాహో సంజయ్ అని పొగిడిన ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి, జాతీయ అధ్యక్షుడు.. తీరా ఎన్నికల సమయంలో ఇలా చేయడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని సోషల్ మీడియాలో లక్షల మంది తప్పు పడుతున్నారు. కష్టపడే నాయకుడికి దక్కిన ప్రతిఫలం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడంపై బీజేపీ అధినాయకత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇప్పుడు ఆ విమర్శలకు బలం ఇచ్చేలాగా కేసీఆర్ తో రాజీపడని నేతగా గుర్తింపు పొందిన నేతగా సంజయ్ ను మార్చడం పట్ల కార్యకర్తల ద్వారా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. కెసిఆర్ ను ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నామని నిన్నటిదాకా ప్రచారం చేసిన బిజెపి నాయకత్వం ఇప్పుడు కాడి పడేసిందని, సంజయ్ ను మార్చడం ద్వారా ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో తెలియాల్సి ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Why was bandi sanjay removed from the post of president
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com