Sangareddy District: పంచాయతీ ఎన్నికలు తెలంగాణ పల్లెలకు పండుగ తెచ్చాయి. రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలు బుధవారం(డిసెంబర్ 17న)జరిగాయి. ఈ ఎన్నికలతో పల్లెలో కోలాహలం నెలకొంది. ఇక చాలా మంది కొత్తవారు రాజకీయాల్లోకి వచ్చారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఏకంగా జాబ్ వదిలేసి పంచాయతీ ఎన్నికల బరిలో దిగాడు. వార్డు సభ్యుడిగా గెలిచి ఏకంగా ఉప సర్పంచ్ అయ్యాడు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతని తల్లిదండ్రులు గ్రామంలో 18 ఏళ్లుగా వివిధ పదవుల్లో ఉన్నారు. గ్రామంలో గడిపే ప్రతి రోజూ అక్కడి ప్రజల అవసరాలు, మౌలిక వసతుల లోపాలు, యువత నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు దగ్గర నుంచి గమనించాడు. తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉపయోగించి గ్రామానికి కొత్త దారి చూపాలనే ఆలోచన బలపడింది.
పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం..
ఇటీవల జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలను తన జీవితంలో మలుపుగా మలుచుకోవాలని ప్రవీణ్ నిర్ణయించుకున్నాడు. గ్రామ ప్రజల మద్దతు, తల్లిదండ్రుల గత అనుభవం, తన సేవాభావం కలిసి తాను నేరుగా సర్పంచ్ పదవికి బరిలో దిగాలనే ఆలోచనకు కారణమయ్యాయి. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు వినడం, తన అభిప్రాయాలు చెప్పడం, అభివృద్ధి పథకం వివరించడం మొదలుపెట్టాడు.
రిజర్వేషన్ కలిసిరాక..
అయితే ఎన్నికల రిజర్వేషన్ జాబితా బయటకు రాగానే అతని ఆలోచనల్లో మార్పు వచ్చింది. సర్పంచ్ స్థానం వేరే వర్గానికి కేటాయించడంతో అతను నేరుగా ఆ పదవికి పోటీ చేయడం సాధ్యపడలేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా, గ్రామ పాలనలో భాగస్వామ్యం కావాలనే పట్టుదలతో వ్యూహం మార్చుకున్నాడు. తన నమ్మకస్త అనుచరుడిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి, సొంత ప్రచారం కంటే ఎక్కువ శ్రమ అతని విజయానికి పెట్టాడు.
వార్డు మెంబర్‌గా విజయం..
ప్రవీణ్ స్వయంగా తన వార్డ్ నుంచి సభ్యత్వానికి పోటీ చేస్తూ, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని వార్డు మెంబర్‌గా విజయం సాధించాడు. అతని కార్యాచరణ ధోరణి, పారదర్శకత, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో సంపాదించిన అనుభవం కలిపి గ్రామస్తుల్లో విశ్వాసాన్ని పెంచాయి. మరోవైపు, తన అనుచరుడిని సర్పంచ్‌గా గెలిపించడంలో కీలక పాత్ర పోషించి, గ్రామ రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత జరిగిన ఉపసర్పంచ్ ఎంపికలో మెజారిటీ సభ్యుల మద్దతుతో ప్రవీణ్‌కుమార్‌ను ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. తద్వారా ఒకే సమయంలో తాను ఊహించినట్లుగా సర్పంచ్ పదవి తన అనుచరుడి చేతుల్లోకి, ఉపసర్పంచ్ బాధ్యతలు తన భుజాలపైకి రావడంతో అతనికి అసలైన సంతృప్తి లభించిందని పేర్కొన్నాడు. సాఫ్ట్‌వేర్ జాబ్ కన్నా.. సొంత గ్రామంలో ఉప సర్పంచ్ పదవే బాగుంది అంటున్నాడు.