Runa Mafi: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి సీఎం అవడానికి మూలమైన ప్రధాన హామీ రైతులకు రూ.2లక్షల రుణమాఫీ.. అధికారం చేపట్టిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆమలులో విఫలం చెందింది. రుణమాఫీ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల్లో కొందరికే ఆ ఫలాలు దక్కితే, కొందరికి మాఫీ వర్తించలేదు. మొత్తం 70 లక్షల మంది రైతులకు దాదాపు రూ.30 వేల కోట్ల వరకు మాఫీ చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు సుమారు 23 లక్షల మంది రైతులకు రూ.19 లక్షల కోట్ల రుణాల మాత్రమే మాఫీ అయ్యాయి. ఇంకో లక్షమందికి ఈ నెలాఖరులోగా మరో రూ.10 వేల కోట్ల వరకు మాఫీ అవుతాయని చెబుతున్నారు.. రుణమాఫీ అమల్లో ఈ తడబాటు ఎందుకు? కొందరు రైతులు అర్హత వున్నా మాఫీ ఎందుకు పొందలేకపోతున్నారు…? కీలకమైన హామీ అమల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఎందుకు సరైన శ్రద్ద పెట్టడం లేదు..? అనే ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలనే డిమాండ్ ప్రతి పక్షాల నుంచే కాకుండా రైతుల నుంచి కూడా వస్తోంది.
■ రుణమాఫీ అమలుకు 31 సాంకేతిక సమస్యల్ని గుర్తించిన అధికారులు:
రుణమాఫీ విధివిధానాలను హడావిడిగా ప్రకటించడం, అర్హుల జాబితాల రూపకల్పనలో బ్యాంకు ల సిబ్బంది, వ్యవసాయశాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి రైతులకు శాపంగా మారింది. అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించకపోవడానికి 31 రకాల సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయని గుర్తించినా వాటిని సరిచేసే ప్రయత్నం చేయడం లేదు. కుటుంబానికి రూ.2లక్షల పరిమితి విధించడంతో కుటుంబాల గుర్తింపులో లొసుగులు చోటుచేసుకున్నాయి.
■ పాత రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబాల్ని ఎలా గుర్తిస్తారు..?
కుటుంబాల గుర్తింపునకి రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. పాత రేషన్ కార్డుల్లో పిల్లలు నేడు వివాహాలు చేసుకొని వేరే కుటుంబాలుగా విడిపోయారు. వేర్వేరుగా రుణాలు పొందారు. ఇప్పుడు వాళ్లంతా ఒకే కుటుంబం అని అందరికీ కలిపి రూ.2లక్షలే రుణమాఫీ అని కొర్రీలు వేయడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ లోపాన్ని సరిచేయకపోతే లక్షమందికి పైగా రైతులు రుణమాఫీకి దూరమైనట్లేననే విమర్శలొస్తున్నాయి.
■ జాయింట్ అక్కౌంట్ లపై స్పష్టత కరువు:
పలు బ్యాంకుల్లో రైతు రుణాలు ఇచ్చేటప్పుడు తల్లి, కుమారుల పేర భూమి ఉంటే వారికి జాయింట్ అకౌంట్ ఇచ్చి రుణాలు ఇచ్చారు. తాజా రుణమాఫీ నిబంధనల్లో జాయింట్ అక్కౌంట్ ఉన్నవారికి రుణాలు మాఫీ కాలేదు. వాళ్ళు రైతులే అయినప్పుడు రుణమాఫీ ఎందుకు చేయలేదని సదరు రైతులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సమాధానం దొరకడం లేదు.
■ ఆధార్ సరిపోలకపోతే తప్పెవరిది ?
చాలా మంది రైతుల రుణమాఫీ ఆటంకాల్లో ఆధార్ సరిపోలడం లేదనే కారణమే ప్రధానంగా చెబుతున్నారు. బ్యాంకు అకౌంట్ లో పేరు, స్పెల్లింగ్ ఒకలా ఉంటే , ఆధార్ లో మరోలా ఉందని, సాఫ్టువేర్ లో ఇది ఎర్రర్ వస్తుండడం వల్ల రుణమాఫీ కి అర్హత కోల్పోయారని చావుకబురు చల్లగా చెబుతున్నారు. ఈ సాంకేతిక సమస్యకి రైతుని ఎలా బలి చేస్తారో సమాధానం చెప్పాలి. చాలా మంది నిరక్షరాస్యులైన రైతులు, అరకొర చదివిన వారే ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. బ్యాంక్ లో అకౌంట్ తీసినప్పుడు, ఆధార్ నమోదు సమయంలో సదరు రైతులు తమ పేర్లు వాడుక భాషలో చెప్పడం, వాటిని నమోదు చేసే సిబ్బంది అడ్డగోలుగా వారికి ఉన్న మిడిమిడి జ్ఞానం మేరకు రాసేయడం వల్ల ఈ సమస్య తలెత్తింది. పేరులో అక్షర దోషాలు, ఇంటి పేరు ముందో, వెనకో ఉండడాన్ని సాకుగా చూపకుండా సదరు రైతు నిజంగా సాగుదరుడైతే రుణమాఫీ అమలు చేయాలి తప్ప ఇలా కొర్రీలు వేయవద్దని రైతులు కోరుతున్నారు.
■ ఇటీవల నిర్వహించిన సర్వే డొల్లతనమే:
రుణమాఫీ అమల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వే డొల్లతనాన్ని బయటపెట్టింది. వ్యవసాయ శాఖ సిబ్బంది నామమాత్రంగానే సర్వే నిర్వహించి మమ అనిపించారనే విమర్శలొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రుణమాఫీ పథకం అమలుపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి అర్హులైన రైతులకి బేషరతుగా మాఫీ అమలు చేయాలని, లేకపోతే మాఫీ కి అర్హత ఉండి, పొందలేకపోయిన దాదాపు 10 లక్షల రైతు కుటుంబాలు కాంగ్రెస్ కి , రేవంత్ సర్కార్ కి వ్యతిరేకంగా మారడం ఖాయం అని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.