KTR: తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ ఎన్నికలో గెలిచి ప్రజల్లో తమకు ఇంకా సుస్థిరమైన స్థానం నిరూపించుకోవాలని గులాబీ పార్టీ.. తమ పరిపాలనకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారనే విషయాన్ని చాటి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ.. ప్రజలు తమను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తిస్తున్నారని బిజెపి.. ఇలా ప్రధాన మూడు పార్టీలు అంచనాలలో ఉన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గులాబీ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు వివిధ న్యూస్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా అనేక విషయాలను ఆయన బయటపెడుతున్నారు. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏబీఎన్ తరఫున వెంకటకృష్ణ కేటీఆర్ ను ఇంటర్వ్యూ చేశారు.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు.. జూబ్లీహిల్స్ నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాల గురించి కేటీఆర్ తనదైన శైలిలో మాట్లాడారు. “రేవంత్ రెడ్డి ఈరోజు రాజకీయాలలో విలువల గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న జైపాల్ రెడ్డి మీద ఏ స్థాయిలో విమర్శలు చేశారు అందరికీ తెలుసు.. చనిపోయిన మాగంటి గోపీనాథ్ గురించి కూడా దారుణంగా మాట్లాడుతున్నారు.. నా సహచరుడు అంటున్నారు. నా స్నేహితుడు అంటున్నారు. చివరికి అసెంబ్లీలో ఒక మాట కూడా మాట్లాడలేదని అంటున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాగంటి గోపీనాథ్ పక్కన ఉన్న ఫోటోలు కూడా నా వద్ద ఉన్నాయి.. వాటిని బయట పెట్టమంటారా? మాగంటి సునీత కన్నీరు కారుస్తుంటే.. ఆమె పిల్లలు బయటకు వచ్చి ప్రచారం చేస్తుంటే.. మంత్రులు హేళనగా మాట్లాడుతున్నారని” కేటీఆర్ ఆరోపించారు.
కవిత సస్పెన్షన్.. ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు.. ఆమె విమర్శల గురించి వెంకటకృష్ణ ప్రస్తావించగా.. కేటీఆర్ స్పందించారు. ” మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మా కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. మీ న్యూస్ ఛానల్ స్టూడియో కు వచ్చి మాపై అనేక విమర్శలు చేశారు.. మాకంటూ ఒక పార్టీ ఉంది. పార్టీలో క్రమశిక్షణ దాటితే చర్యలు వేరే విధంగా ఉంటాయి.. పార్టీ లైన్ దాటారు కాబట్టి కవిత మీద సస్పెన్షన్ వేటు పడింది.. దాని గురించి నేను మాట్లాడడానికి ఏమీ ఉండదు. కవిత పార్టీ విధివిధానాలను అతిక్రమించారు కాబట్టి.. మా పార్టీ అధినేత ఆమె మీద చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ చేశారు. ఇక దీని గురించి నేను మాట్లాడడానికి పెద్దగా ఏమీ ఉండదని” కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవిత ను పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత తొలిసారిగా మాట్లాడిన కేటీఆర్.. ఏమాత్రం వెరవకుండా మాట్లాడడం విశేషం.