https://oktelugu.com/

NTR Jayanthi : తెలంగాణలో కూడా ఎన్టీఆర్ జయంతిని ఇంత ఘనంగా ఎందుకు జరుపుతున్నారు..?

2014లో రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి వారికి పదవులను అందించాడు కేసీఆర్. అటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి శతజయంతిని భారత రాష్ట్ర సమితి నాయకులు ఘనంగా చేస్తుండడం ఇప్పుడు సర్వత్ర చర్చకు కారణమైంది.

Written By: , Updated On : May 28, 2023 / 09:51 PM IST
Follow us on

NTR Jayanthi : విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రులు గర్వించదగ్గ నటుడు నందమూరి తారక రామారావు శతజయంతిని భారత రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పని చేసిన కేసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ.. శత జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందే ఆలోచన ఉన్నట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పలువురు బిఆర్ఎస్ నాయకులు నిర్వహించడం వెనుక బిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం దాగి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతిని తెలంగాణ రాష్ట్రంలోనూ, అందులోనూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట దశకు ఒక రకంగా చెప్పాలి అంటే కెసిఆరే కారణం. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి వారికి పదవులను అందించాడు కేసీఆర్. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొలుకోలేకుండా పోయింది. అటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి శతజయంతిని భారత రాష్ట్ర సమితి నాయకులు ఘనంగా చేస్తుండడం ఇప్పుడు సర్వత్ర చర్చకు కారణమైంది.

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే ఆలోచన..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో లేదు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్లు నివసిస్తున్నారు. వీరితోపాటు తెలంగాణలోనూ ఎన్టీఆర్ ను ఇప్పటికీ అభిమానిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే ప్రతి ఓటు కూడా భారత రాష్ట్ర సమితికి కీలకంగా మారుతుంది. ఆ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్లను, ఎన్టీఆర్ అభిమానులను పూర్తిగా భారతీయ రాష్ట్ర సమితి వైపు తిప్పుకునే ఆలోచనతోనే ప్రస్తుతం శత జయంతి వేడుకను తెలంగాణలో ఘనంగా ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఒక రకంగా ఇది కేసీఆర్ రాజకీయ ఆలోచనలో నుంచి పుట్టిన ఎన్నికల క్రీడగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్లు, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కొంతలో కొంత కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం తెలంగాణలో కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వారిలో సానుకూల భావన ఉంది. ఈ భావన నుంచి ఓట్లు పడితే కొంత ఇబ్బంది ఉంటుందని భావిస్తున్న కెసిఆర్.. చాణిక్యత ప్రదర్శించి ఎన్టీఆర్ వందో జయంతిని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేలా చేయడం ద్వారా వారి ఆలోచనలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

దాదాపుగా భారత రాష్ట్ర సమితిలో టీడీపీ నాయకులే..

ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీలో కొనసాగుతున్న 80 శాతం మంది నాయకులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సహా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు ఎంతోమంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు. వీరందరూ ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుతో పని చేశారు. ఆ గౌరవభావం కూడా వీరిలో ఉంది. కొందరు ఎన్టీఆర్ తో పని చేయకపోయినా రాజకీయ ఓనమాలు అక్కడే దిద్దారు. దీంతో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పట్ల వారిలో సానుకూల భావన ఉంది. దీనితోపాటు రాజకీయంగా ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి నాయకులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారన్న చర్చ జరుగుతోంది. చూడాలి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్లు, ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.