Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదం ఎంతలా రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతగానో మనోవేదనకు గురయ్యారు. ఇటు పార్టీల మధ్య కూడా ఈ వ్యవహారం మరింత రాజేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, వైసీపీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది. చివరకు పరిస్థితి అధికారం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్లుగా మారింది. ఇరువర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమానికి తెరలేపారు. మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకొని ఏడుకొండల వారిని దర్శించుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వైసీపీపై దుమ్మెత్తిపోసినంత పనిచేశారు. తిరుమల శ్రీవారిని అపవిత్రం చేశారని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలోనే జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యితో లడ్డూలను తయారుచేశారని ఆరోపించారు. ల్యాబ్ టెస్టుల్లోనూ అదే నిరూపితమైందని చెప్పుకొచ్చారు.
అయితే.. వారం రోజుల పాటు రచ్చరచ్చగా మారిన తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణిగింది. ఒకవిధంగా చెప్పాలంటే చంద్రబాబు 40ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు పొందారు. లడ్డూలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యి వాడారని నిరూపితం కాకముందే రాజకీయాల్లో ఎలా ప్రకటనలు చేస్తారని బాబుపై ఫైర్ అయింది. దాంతో ఆ వివాదం అక్కడి నుంచి కాస్త చల్లబడినట్లు అయింది.
ఇక.. ఈ లడ్డూ వివాదాన్ని తెలంగాణలోని ఏ నేతలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా పొలిటికల్ వార్ నడువగా.. ఇక్కడి నేతలు మాత్రం ఆ వివాదంపై ఎవరూ స్పందించలేకపోయారు. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ నేతలు కానీ పెద్దగా మాట్లాడలేదు. బీజేపీ నుంచి ఒకరిద్దరు నేతలు వివాదం మొదలైన సందర్భంలో మాట్లాడినప్పటికీ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఇక లడ్డూ వివాదం అంశమే వినిపించలేదు.
అంత పెద్ద వివాదం జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్పందన లేకపోవడంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏపీలో నెలకొన్ని లడ్డూ వివాదం అక్కడి రెండు పార్టీలకు సంబంధించిన అంశమనే భావనకు వచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే.. ఇక్కడి పార్టీలు లైట్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా నిరూపితం కాకపోవడంతో ఎందుకు ఆ గొడవను నెత్తినేసుకోవడం అనే అభిప్రాయం ఇక్కడి నేతల్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో కల్తీ జరిగితే ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగేవారని వాదన కూడా వినిపించింది. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతోనే పార్టీల నేతలంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయినట్లు పొలిటికల్ టాక్ నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ప్రజాసమస్య కానప్పుడు స్పందించి వ్యతిరేకతను తెచ్చుకోవడం ఎందుకనే అందరికందరు దూరంగా ఉన్నారని పొలిటికల్ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.