Hyderabad HYDRA : ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో నిర్మాణాలను నేలమట్టం చేయగా.. వెయ్యి ఎకరాలకు పైగా భూమిని రికవరీ చేశారు. అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా సామాన్యుల బతుకులను బుగ్గి చేస్తోందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఉన్నోడికి, లేనోడికి ఒకే న్యాయం అని చెప్పినప్పటికీ.. పేదలు మాత్రం భారీ ఎత్తున నష్టపోతున్నారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏది బఫర్ జోన్..? ఏదీ ఎఫ్‌టీఎల్..?
బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలను కూల్చివేస్తున్నామని హైడ్రా కానీ, ప్రభుత్వం కానీ చెప్తోంది. అయితే.. ప్రజలకు మాత్రం ఏది బఫర్ జోన్, ఏది ఎఫ్‌టీఎల్ అనే అంశంపై క్లారిటీ లేకుండా పోయింది. ఎంతో కష్టపడి ఇల్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు దానిని బఫర్ జోన్ అని, ఎఫ్‌టీఎల్ నిర్మాణం అంటూ చెబుతుండడంతో పేదప్రజలంతా ఆందోళనలో పడిపోతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటివరకు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ నిర్మాణాలపై ఎలాంటి లిస్ట్ ఇవ్వలేదు. దాంతో ఎప్పుడు ఆ బిల్డింగ్ నేలమట్టం అవుతుందా అని ఎవరికి అర్థం కాని పరిస్థితి.
కళ్ల ముందు కోట్ల ఆస్తులు నేలమట్టం
ఒక పేదోడు ఇల్లు కొనుగోలు చేయాలన్నా.. ఇల్లు నిర్మించుకోవాలన్నా దశాబ్దాల కాలం సమయం పడుతుంది. ఎంతో ప్లానింగ్ ఉంటే కానీ ఒక ఇల్లును సంపాదించుకోలేం. నిద్రహారాలు మాని.. పగలు రాత్రిళ్లు కష్టపడి.. ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతుంటారు. అలా రూపాయి రూపాయి పోగేసి చాలా మంది ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే.. తమ ఇళ్లు బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని వారికి కూడా తెలియదు. ముందుగా పర్మిషన్లు, పత్రాలను చూసే వారు ఆ మేరకు కొనుగోలు చేశారు. కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇళ్లు ఇప్పుడు నేలమట్టం అవుతున్నాయి. ఎవరైనా తెలిసి చేస్తే అది నేరం అవుతుంది.. తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది. అయితే.. ఇక్కడ జరిగింది పొరపాటే. మరి ఆ పొరపాటును సరిదిద్దే అవకాశం లేదా..? పొరపాటుకు కోట్ల రూపాయలు నష్టపోవాల్సిందే..? అనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.
బాధితులు ఏడుపులు.. హాహాకారాలు
నిన్న కూకట్‌పల్లి, అమిన్ పూర్ పరిధిలో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేసింది. ఈ క్రమంలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున రోదనలు వినిపించాయి. అధికారులు, పోలీసుల కాళ్లు వేళ్లా పడ్డారు. అయ్యా కాపాడండి అంటూ వేడుకున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి ప్రజలు అక్కడ నివాసం ఉండిపోయారు. ఒక్కసారిగా హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేతలు ప్రారంభించడంతో బాధితులంతా ఏం చేయాలో తెలీక బాధితులు ఏడ్చేశారు. కనీసం తమకు వారం రోజులైనా సమయం ఇవ్వాలంటూ కోరారు. కానీ.. అధికారులు తమకు ఉన్న నిబంధనల ప్రకారం వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజలు అంతలా వేడుకున్నా హైడ్రా అధికారులు కనీసం కనికరించలేదు. తమ డ్యూటీని తాము చేసుకుంటూ వెళ్లారు. కనీసం వాటిల్లోని సామగ్రిని అయినా తీసుకొని వెళ్తామని, ఒక్క రోజు సమయం అయినా ఇవ్వాలని అన్నారు. అయినా అధికారులు మాత్రం ససేమిరా అన్నారు. దాంతో కోట్లాది రూపాయలు ఆస్తులు నేలమట్టం అయ్యాయి. మధ్య తరగతి కుటుంబాల జీవిత కాలం కష్టార్జితం కళ్లెదుటే కూలిపోతుంటే వారి ఆక్రోశం అంతాఇంతా కాదు. దేవుడా.. ఏంటి మాకు ఈ దుస్థితి అని వేడుకున్నారు. అయినా.. కనికరం లేని హైడ్రా కేవలం నిన్న ఒక్క రోజే హైడ్రా సుమారు 8 ఎకరాల స్థలాన్ని కైవసం చేసుకుంది.
ఈఎంఐలు కట్టేదెలా..?
పేద, మధ్య తరగతి ప్రజలకు ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. అయితే దానికి కొంత డబ్బు పోగేసి.. మరికొంత బ్యాంకు లోన్లు తీసుకొని కొనుగోలు చేస్తుంటారు. నిన్న హైడ్రా కూల్చివేతల్లో చాలా మంది బాధితులు ఇలానే కొనుగోలు చేశారు. కోటి రూపాయల్లో 20శాతం సొంతంగా పే చేసి.. మిగితా 80 శాతం వారు లోన్ల రూపకంగా తీసుకున్నారు. నిత్యం కష్టపడుతూ ఏదో ఒక రకంగా ఈఎంఐలు కడుతూ వస్తున్నారు. ఒక్కసారిగా హైడ్రా తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు బాధితుల ఈఎంఐల పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మిగిలింది.
బాధ్యత ఎవరిది..?
అక్రమ కట్టడాలని హైడ్రా కూల్చివేస్తోంది. అయితే.. దీనికి బాధ్యలెవరు..? దీనికి బాధ్యత ఎవరిది..? కోట్లాది రూపాయల పేదల ఆస్తులకు రక్షణగా నిలిచేది ఎవరు..? ఇప్పుడు సర్వత్రా ఇవే ప్రశ్నలు వినిపిస్తునానయి. కోట్లాది రూపాయలతో కొన్న ఇళ్లకు ఆ సందర్భంలో అధికారులే అన్నిరకాల అనుమతులు ఇచ్చారు. బాధితులు సైతం ఆయా డాక్యుమెంట్లను చూసుకొని వాటిని కొనుగోలు చేశారు. ఆ సందర్భంలో బిల్డర్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి ఆ రకంగా కొన్నారు. అయితే.. జీహెచ్ఎంసీ నుంచి, రెవెన్యూ పరంగా దాదాపు అనుమతులు వచ్చాయి. మరి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న వాటికి ఆ సందర్భంలో ఎలా అనుమతులు ఇచ్చారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎవరో చేసిన తప్పిదాలకు ఇప్పుడు పేదలు నష్టపోవాల్సిందేనా..? ప్రభుత్వం వీరికి చెప్పే సమాధానం ఏంటి..? వీరికి భరోసా ఇచ్చే వారు ఎవరు..? చట్టం ప్రకారం పోతున్నామని హైడ్రా చెబుతున్నప్పటికీ ఆ చట్టం కొంత మందికే చుట్టంలా మారిందని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అనుమతులు ఇచ్చిన వారిని, అమ్మినవాడిని వదిలి కొన్న వారికి శిక్ష వేయడం ఏంటని వినిపిస్తున్న మాటలు. హైడ్రా పెద్దోళ్లను వదిలి పేదలను మాత్రమే టార్గెట్ చేస్తున్నదనే పేదలు ముక్తకంఠంతో వినిపిస్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రజల నుంచి నిలదీతలు మొదలు కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టరీత్యా నేరాలకు పాల్పడిన వారిని పేదలను శిక్షించడంపై ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారంలో ఉన్న వారు బెదిరించడానికో.. బ్లాక్ మెయిల్ చేయడానికి వస్తే ప్రజల నుంచి నిలదీతలు రావాల్సిన అవసరం ఉందని సర్వత్రా వినిపిస్తోంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Who will bear the pain of the hyderabad hydra victims
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com