Telangana CS: ప్రభుత్వాల్లో ప్రధాన కార్యదర్శుల పాత్ర చాలా కీలకం. సమర్థులైన ఐఏఎస్‌లు(IAS) ఉంటే.. ప్రభుత్వ పాలన సాఫీగా సాగుతుంది. అందుకే ఈ పోస్టుకు ఎంపిక చేసే ఐఏఎస్‌ల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా… గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం నియమించిన సీఎస్ శాంతికుమారితోనే పాలన సాగిస్తున్నారు. మరోరెండు నెలల్లో ఆమో పదవీకాలం పూర్తికానుంది. దీంతో కొత్త సీఎస్ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. మరోవైపు సీనియర్ ఐఏఎస్‌లు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. తర్వాత సీఎస్ రేసులో జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది.
బీఆర్‌ఎస్ హయాం నుంచే శాంతికుమారి..
ప్రస్తుత సీఎస్ శాంతికుమారిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నియమించింది. ఈమె 1989 బ్యాచ్ ఐఏఎస్. తెలంగాణ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి(First Womn Chief Secretary)గా ఆమె రికార్డు సృష్టించారు. 2023, జనవరి 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది. 2025 ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎస్‌ను మారుస్తారన్న చర్చ జరిగింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండానే శాంతికుమారినే రేవంత్‌రెడ్డి సర్కార్ కొనసాగించింది.
తర్వాత రేసులో..
ఇక శాంతి కుమారి తర్వాతి రేసులో ఉన్న ఐఏఎస్ జయేశ్‌రంజన్(Jayesh Ranjan) 1992 బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం ఈయన ఐటీ, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. ఆయనకు ఇంకా రెండున్నరేళ్ల సర్వీస్ ఉంది. 1992 బ్యాచ్ ఐఏఎస్ వికాస్‌రాజ్‌కు మరో మూడేళ్ల సర్వీస్ ఉంది. ప్రస్తుతం ఈయన ఆర్‌అండ్‌బీ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో వికాస్‌రాజ్ సీఈవోగా కూడా పనిచేశారు. ఇటీవల శాంతికుమారి సెలవుపై వెళ్లగా వికాస్‌రాజే తాత్కాలిక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ఇక రేసులో ఉన్న మరో ఐఎస్ శశాంక్ గోయల్. ఈయన 1990 బ్యాచ్ ఐఏఎస్. అందరికన్నా సీనియర్ ఇతనే. ప్రస్తుతం ఎంసీహెచ్‌ఆర్డీ డీజీగా ఉన్నారు. ఈయన రిటైర్ కావడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. 1991 బ్యాచ్ ఐఏఎస్ రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈయన ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు.