Basara IIIT : ట్రిపుల్ ఐటీ… పదో తరగతి తర్వాత అత్యున్నత ప్రమాణాలతో అందుబాటులోకి సాంకేతిక విద్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో ఉమ్మడి ఆధ్రప్రదేశ్‌లోని కడపలో, తెలంగాణ ప్రాంతంలోని బాసరలో ఈ ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. దేశ విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విద్యాసంస్థలు కావడంతో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం ఏటా పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది. ట్రిపుల్‌ఐటీలో చేరితో భవిష్యత్‌కు ఢోకా ఉండది అన్న నమ్మకం తల్లిదండ్రుల్లోనూ ఏర్పడడమే ఇందుకు కారణం. ఆరేళ్లు కష్టపడితే తమ పిల్లలు జీవితంలో సెటిల్ ఐపోతారు అని భావిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బాసర ట్రిపుల్ ఐటీలో కొన్ని ఘటనలు మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి.
విద్యార్థుల ఆత్మహత్యలు..
ట్రిపుల్ ఐటీలో ఈ ఏడాదిలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక విద్యార్థి అనారోగ్యం కారణంగా ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకోగా, మరో విద్యార్థి వ్యక్తిగత కారణాలతో హాస్టల్‌లో ఉరేసుకున్నాడు. తాజాగా జూన్ 13న వడ్ల దీపిక, జూన్ 15న లిఖిత మృతిచెందారు. దీపిక బాత్‌రూంలో ఆత్మహత్య చేసుకోగా, లిఖిత భవనంలోని నాలుగు అంతస్తుల పైనుంచి పడి మృతిచెందింది.
మాస్‌కాపీయింగ్ కారణమా..
పీయూసీ–1 చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రెండు రోజుల వ్యవధిలో చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడ్డారని అధ్యాపకులు మందలించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ పట్టుకొచ్చారు. గుర్తించిన అధ్యాపకులు నలుగురు విద్యార్థులను మందలించారు. ఇందులో దీపిక అదేరోజు బాత్‌రూంలో ఉరేసుకుంది. లిఖిత రెండు రోజుల తర్వాత భవనంపైనుంచి పడి చనిపోయింది. మాస్‌కాపీయింగ్ సందర్భంగా అధ్యాపకులు తీవ్రంగా మందలించడంతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుక్కలు తరుమడం నిజమేనా..
లిఖిత భవనం పైనుంచి పడి చనిపోవడానికి కుక్కలు కారణమన్న వాదన వినిపిస్తోంది. మొదట ఫోన్ చూస్తూ పడిపోయిందన్నారు.. తర్వాత ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. తర్వాత కుక్కలు తరుమడంతో భవనం పైనుంచి దూకిందని అంటున్నారు. ఇందులో వాస్తవం మాత్రం ఎవరికీ తెలియదు. అర్ధరాత్రి 2 తర్వాత విద్యార్థిని ఒంటరిగా బయటకు ఎందుకు వచ్చింది… హాస్టల్ భవనం నాలుగో అంతస్తులో కుక్కలు ఉన్నాయా?.. అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడే స్వేచ్ఛ హాస్టల్‌లో ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వేతనాల కోసం పనిచేసే అధ్యాపకులు, వార్డెన్ల కారణంగానే లిఖిత మరణించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వాదన ఏంటంటే అధ్యాపకుల వేధింపులే విద్యార్థులను బలి తీసుకుంటున్నాయని కూడా కొంతమంది పేర్కొంటున్నారు.