https://oktelugu.com/

Telangana farmers: రైతుల కడుపు మండితే ఇట్లుంటదీ.. ముఖ్యమంత్రి శవయాత్రకు పోలీసు బందోబస్తీ చేయాల్సి వస్తది!

 తెలంగాణలో రైతుల రుణాల మాఫీకి సంబంధించి జరుగుతున్న రచ్చ రోజురోజుకూ సరికొత్త రూపు దాల్చుతోంది. నూటికి నూరు శాతం రుణాలు మాఫీ చేసామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే.. రుణమాఫీ సంపూర్ణం కాలేదని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 19, 2024 / 09:11 PM IST

    Telangana farmers

    Follow us on

    Telangana farmers: సోమవారం భారతదేశం మొత్తం రక్షాబంధన్ వేడుకల్లో నిమగ్నమై ఉంటే.. భారత రాష్ట్ర సమితి నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులపై మండిపడుతున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ.. ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. హరీష్ రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన భారత రాష్ట్ర సమితి నాయకులు.. సోమవారం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే లక్ష్యంగా చేసుకొని.. ఆయన దిష్టిబొమ్మలకు శవయాత్రలు చేశారు. పలుచోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయలేదని ఆరోపించారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండానే ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వంటి మంత్రులు కూడా సంపూర్ణంగా రుణమాఫీ కాలేదని చెబుతున్నారని.. ముఖ్యమంత్రి మాత్రం నూటికి నూరు శాతం రుణాలు మాఫీ అయ్యాయని అంటున్నారని… ఇందులో ఎవరి మాటలు నమ్మాలని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు.

    భారత రాష్ట్ర సమితి నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహిస్తుండగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారత రాష్ట్ర సమితి నాయకులు పరస్పరం ఘర్షణ పడకుండా వారు ఎక్కడికక్కడ మొహరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం నాయకులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ” రుణమాఫీ సంపూర్ణంగా కాకపోవడంతో రైతుల కడుపు మండుతోంది. అందువల్లేవారు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. కొన్నిచోట్ల శవయాత్ర కూడా చేస్తున్నారు. వీటికి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ఈ స్థాయిలో దారుణం జరుగుతోంది. ఇదేనా ప్రజలు కోరుకున్న మార్పు.. ఇదేనా కాంగ్రెస్ నాయకులు అందిస్తున్న మార్పు అంటూ” భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. గతంలో కెసిఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసిన దృశ్యాలను, అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఫోటోలను కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి నాయకుల మధ్య సోషల్ మీడియాలో తారాస్థాయిలో యుద్ధం జరుగుతోంది.