Chandrababu Naidu రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రజా ప్రతినిధులు కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి.. విమర్శలకు అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలలో అత్యంత ఒడుపుగా పనిచేయాలి.. అలా కాకుండా నాయకులు వేరే విధంగా వ్యవహరిస్తే పరిణామాలు మరొక విధంగా ఉంటాయి.
ఇటీవల వన్డే వరల్డ్ కప్ మన దేశం వేదికగా జరిగింది. ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పై అద్భుతమైన విజయం సాధించింది. తద్వారా ట్రోఫీని అందుకుంది. ఈ విజయంలో మన జట్టు అమ్మాయిలు అద్భుతమైన ప్రతిభను చూపించారు. తెలుగు అమ్మాయి శ్రీ చరణి అమోఘమైన బౌలింగ్ వేసింది.. కీలకమైన వికెట్ పడగొట్టింది. అంతకుముందు సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు తీసింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అమ్మాయి ఎన్నో ఘనతలు సాధించింది. టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. శ్రీ చరణి ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన నివాసం వద్దకు పిలిపించుకున్నారు. అంతకంటే ముందు ఆమెకు విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికించారు. ఐటీ మంత్రి నారా లోకేష్ నేరుగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకొని వెళ్లారు.. ముఖ్యమంత్రి ఆమెతో చాలాసేపు మాట్లాడారు. ఫైనల్లో ఎదుర్కొన్న ఒత్తిడి గురించి.. ఇతర విషయాల గురించి ఆమెతో చేర్చించారు. ఆ తర్వాత కడపలో ఆమెకు ఇంటి స్థలాన్ని.. గ్రూప్ వన్ ఉద్యోగాన్ని.. రెండున్నర కోట్ల ప్రభుత్వ సహాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు.
చంద్రబాబు చేసిన ప్రకటన ఒకరకంగా ఆమోదయోగ్యమైనది. అభినందించదగ్గది. ఎందుకంటే ఇటువంటి ప్రోత్సాహకాలు క్రీడాకారులకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మిగతా వారిని కూడా క్రీడారంగం వైపు వెళ్లేలా చేస్తాయి.. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకో కాస్త వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లో ట్రోఫీ సాధించిన టీమిండియాలో తెలంగాణ ప్లేయర్ అరుంధతి రెడ్డి కూడా ఒక సభ్యురాలు. కాకపోతే ఆమెకు ఆడే అవకాశం రాలేదు. అయినప్పటికీ ఆమె ప్రతిభ గురించి తక్కువ అంచనా వేయడానికి లేదు. వరల్డ్ కప్ కు మేనేజ్మెంట్ ఎంపిక చేసిన జట్టులో ఆమె కూడా ఒక సభ్యురాలు.. ఆమె నేరుగా ఆడకపోయినప్పటికీ.. రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితమైనప్పటికీ.. ఆమెకు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి స్వాగతం పలికి ఉంటే మరో విధంగా ఉండేది. ఆమెకు ఎంతో కొంత ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తే మరింత గొప్పగా ఉండేది. ఇలాంటి విషయాలలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశాన్ని ఇవ్వరు. కానీ రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం చంద్రబాబును అనుసరించలేకపోతున్నారు. అందువల్లే విమర్శల పాలవుతున్నారు. ఆ మధ్య మహమ్మద్ సిరాజ్, దీప్తి వంటి ప్లేయర్లకు రేవంత్ అండగా నిలిచారు. ప్రభుత్వం తరఫున భారీ నజరానా ప్రకటించారు.. కానీ అరుంధతి రెడ్డి విషయంలోనే ఎందుకో రేవంత్ రెడ్డి అంతగా స్పందించడం లేదు.