Telangana Decade Celebrations : మొన్న హైదరాబాదులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమావేశమయ్యారు. హైదరాబాదులో పనిచేస్తున్న పాత్రికేయుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని సమావేశం ముగిసిన తర్వాత అల్లం నారాయణ విలేకరులకు వెల్లడించారు. ఇదే సమయంలో ” ప్రస్తుతం తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్ని శాఖలు అందులో పాలుపంచుకుంటున్నాయి. మరి జర్నలిజం ఏం పాపం చేసింది? పాత్రికేయులు ఏం ద్రోహం చేశారు? మమ్మల్ని ఎందుకు భాగస్వాములు చేయడం లేదు?” అంటూ ఓ విలేకరి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా అల్లం నారాయణ వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రతిఘటనలు అల్లం నారాయణ చాలానే ఎదుర్కొంటున్నారు.. విలేకరులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తెల్ల మొహం వేస్తున్నారు.
వాస్తవానికి తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలే. కానీ ఎన్నికల సంవత్సరం కావడం, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దశాబ్ది వేడుకలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఏకంగా 21 రోజులపాటు వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వీటిని తెలంగాణ దశాబ్ది వేడుకలు అనేదానికంటే భారత రాష్ట్ర సమితి ప్రచార ఆర్భాటం అని అనడం సబబు. వేడుకలకు అరకొరగా నిధులు ఇచ్చిన ప్రభుత్వం.. మిగతా బరువు మొత్తం అన్ని శాఖల మీద వేసింది. దీంతో ఆ అధికారులు చేసేదేం లేక కాంట్రాక్టర్లు, సర్పంచుల పై ఆ భారం వేస్తున్నారు.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారిని మాత్రం విస్మరిస్తున్నారు. ఎంతసేపటికి భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ప్రచారం తప్ప ఇంకో మాట ఉండడం లేదు. ప్రభుత్వ పథకాలను వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను బయటికి కనిపించకుండా ఉండేందుకు రకరకాల ఆర్భాటాలు చేస్తున్నారు.
ఉద్యమకారులకు ఏదీ గౌరవం?
తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్ణాలు కొట్లాడాయి. అలయ్ బలయ్ నుంచి ధూమ్ ధాం దాకా వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాట ఉద్యమానికి కొత్త రూపు ఇచ్చింది. విద్యుత్ జేఏసీ రఘు వెల్లడించిన విద్యుత్ గణాంకాలు ఆంధ్ర పాలకుల దోపిడిని కళ్లకు గట్టాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఉద్యోగ ఖాళీల లెక్కలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళ ముందు ఉంచాయి. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో వీరంతా ముందుండి పోరాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రాంతానికైతే వ్యతిరేకంగా పోరాటం చేశారో.. వారు ప్రభుత్వంలో భాగమయ్యారు. బొగ్గు గనుల నుంచి రోడ్డు కాంట్రాక్టుల వరకు అంతటా వారే చేపడుతున్నారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొంటున్న వారు మాత్రం దోషులుగా నిలబడ్డారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దేనికీ గొరగాకుండా పోయారు. తెలంగాణ ఉద్యమం మీద సినిమాలు తీసిన నర్సింగ రావు లాంటి దర్శకుడికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే భారత రాష్ట్ర సమితి పాలన ఏ విధంగా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇక బంగారు తెలంగాణ బ్యాచ్ ప్రవేశంతో ఒరిజినల్ తెలంగాణ వాదులకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్యాయమే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పారు. ప్రతిపక్ష పార్టీలను చీల్చి ఆ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకున్నారు. ఇక్కడ ఓటు వేసి గెలిపించిన ప్రజలను కూడా ఓడించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించారు. కేవలం తనకు బాకాలు ఊదే వారికి మాత్రమే స్థానం కల్పిస్తూ, తన పాలన విధానాన్ని ప్రశ్నిస్తున్న వారిని మాత్రం పాతాళానికి తొక్కేస్తున్నారు. తొమ్మిది సంవత్సరాలలో ఎంతోమంది ఉద్యమకారులు ప్రతిభవన్ మెట్లు ఎక్కేందుకు విఫల యత్నం చేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారి ప్రయత్నం వృధా అయ్యింది. ఇప్పటి దశాబ్ది వేడుకల్లో కూడా వారి ప్రస్తావన లేకుండా పోయింది. అందుకే తెలంగాణ సమయంలో ఉవ్వెత్తిన ఎగిసిన పాట రూపం మార్చుకుని ” ఎవని పాలయ్యిందిరో తెలంగాణ? ఎవడు ఏలుతున్నడురో తెలంగాణ?” అంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తోంది.