Software industry crisis 2025: వారంలో ఐదు రోజులు పని.. ఐదు అంకెలకు మించిన జీతం.. బోనస్ లు.. ఇంక్రిమెంట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సౌకర్యాలు.. కంపెనీ మారితే చాలు శాలరీ హైక్ అయ్యేది. కనివిని ఎరుగని రేంజ్ లో కనక వర్షం కురిసేది. ఐటి ఇండస్ట్రీలో పనిచేసే ఎంప్లాయి ల గురించి పై ఉపోద్ఘాతం మాదిరిగానే చెప్పుకునేవారు.. అంతేకాదు ఐటీ పరిశ్రమలో పనిచేసే వారికి అమ్మాయిలను ఇవ్వడానికి చాలామంది పోటీపడేవారు. కోరినంత కట్నం.. తగినంత బంగారం.. కావలసినంత పొలాలు ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న పరిస్థితులు.. ఐటీ సేవలకు తగ్గిన గిరాకీ.. ఫలితంగా ఐటి పరిశ్రమ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. పైగా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. గడచిన మూడు సంవత్సరాలుగా ఐటీ పరిశ్రమలో తొలగింపులు తప్ప కొత్త నియామకాలు లేవు. ప్రాంగణ నియామకాలు లేకపోవడంతో చాలామంది నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఒకవేళ నియామకాల ప్రక్రియ జరిగినప్పటికీ ఉద్యోగాలు తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. ఇక కోర్ ఇంజనీరింగ్ కు డిమాండ్ తగ్గడంతో చాలామంది సాఫ్ట్వేర్ వైపుకు వస్తున్నారు. దీంతో కోర్సులు చదివేవారు పెరిగిపోతున్నారు. ఉద్యోగాలు వారికి తగ్గట్టుగా లేకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగాల కల్పనలో అంతరం వల్ల యువతలో నిరాశ కనిపిస్తోంది.
గడచిన మూడు సంవత్సరాలుగా ఐటీ ఇండస్ట్రీ తిరోగమనాన్ని ఎదుర్కొంటున్నది. ఇదే అదునుగా కంపెనీలు కూడా అడ్డగోలుగా ఉద్యోగాలలో కోతలు విధిస్తున్నాయి. దీంతో చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక మన దేశంలో పేరు పొందిన ఐటీ కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. తాజాగా టిసిఎస్ కంపెనీ కూడా ఉద్యోగాలలో దారుణమైన కోత విధించింది ఆటోమేషన్ యుగంలో కంపెనీ అవసరాలు తీర్చలేని ఉద్యోగులను మొహమాటం లేకుండా బయటికి పంపించేస్తోంది. సంస్థతో దీర్ఘకాలం అనుబంధం కలిగిన ఉద్యోగులకు మాత్రం రెండు సంవత్సరాల పాటు వేతనాన్ని పరిహారంగా ఇస్తోంది. ఈ ఏడాది జూలై నెలలో దాదాపు 12,000 మందికి ఉద్వాసన పలికింది టీసీఎస్. ఇందులో భాగంగానే వారికి 3 నెలల పాటు నోటీస్ పీరియడ్ ఇస్తోంది. ఆ మూడు నెలలకు కంపెనీ ఉద్యోగులకు వేతనం చెల్లిస్తోంది. దీనికి తోడు అదనంగా ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు పరిహారం ప్యాకేజీ కింద వేతనం చెల్లిస్తోంది. ఎనిమిది నెలలకు మించి బెంచ్ పై ఉండే వారికి సింప్లర్ ప్యాకేజీ అమలు చేస్తోంది. వారికి నోటీస్ పీరియడ్లో ఉన్న వేతనాలు మాత్రమే చెల్లిస్తోంది.
సంస్థతో 10 నుంచి 15 సంవత్సరాల అనుబంధం ఉన్న వారు తాజా లే ఆఫ్ లో ఉద్యోగం కోల్పోతే.. వారికి ఏడాదిన్నర పాటు వేతనాన్ని చెల్లిస్తోంది. 15 సంవత్సరాలకు మించి సంస్థతో అనుబంధం ఉన్నవారికి గరిష్టంగా రెండు సంవత్సరాలు పాటు వేదనంగా చెల్లిస్తోంది. అవుట్ ప్లేస్మెంట్ సేవలను కూడా అందిస్తోంది. ఒకవేళ మానసిక ఆరోగ్యం బాగోలేకపోయిన వారికి టిసిఎస్ కేర్ ప్రోగ్రాం కింద చికిత్స లేదా తెరపి అందిస్తోంది. ఒకవేళ రిటర్మెంట్ కు దగ్గర పడిన వారికి ముందస్తు పదవి విరమణ కూ అవకాశం కల్పిస్తోంది టిసిఎస్. వీరికి వారి అనుభవాన్ని బట్టి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు వేతనాన్ని పరిహారం ప్యాకేజీ కింద చెల్లిస్తోంది. అంతేకాదు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.