Konda Surekha political future: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొండా సురేఖ విషయం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మేడారం పనుల పై చేసిన ఆరోపణలతో మొదలైన వివాదం ఓ ఎస్ డి తొలగింపుతో తీవ్రమైంది. ఇటీవల మంత్రి సురేఖ ఓ ఎస్ డి ఎన్ సుమంత్ ను ప్రభుత్వం తొలగించడంతో.. ఆమె కూతురు సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో ఏ విధంగాను స్పందించని మంత్రి సురేఖ.. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి మంత్రి సురేఖ హాజరు కాలేదు. ఈ విషయం అధిష్టానం వద్దకు వెళ్లడంతో.. ప్రస్తుతం ఏం జరుగుతుందోనన్న ఆసక్తి చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ భవిష్యత్తు ఏంటి? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులకు ప్రత్యేక పేరు ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ ఇప్పటివరకు అనేక పార్టీలు మారారు. అయితే ఆమె చేరిన ప్రతి పార్టీలో ఏదో ఒక వివాదంతో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నియోజకవర్గం నుంచి గెలపొందారు. అయితే రాజకీయాల్లో సీనియర్ అయినా కొండా సురేఖ మహిళా కోటలో మంత్రి పదవిని దక్కించుకున్నారు.
మంత్రి పదవి చేపట్టిన కొన్నాళ్ల తర్వాత కొండా సురేఖ పై అనేక ఆరోపణలు వచ్చాయి. వరంగల్ జిల్లాలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రిపై ఆరోపణలు చేశారు. పార్టీ నాయకులను పట్టించుకోవడంలేదని.. వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అయితే రాష్ట్ర అధిష్టానం చేసుకొని వివాదాన్ని తొలగించారు. అయితే తాజాగా మేడారం పనుల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తాను దేవదాయ శాఖ మంత్రి అయి ఉండి.. సొంత జిల్లాలో మేడారం పనులకు సంబంధించిన టెండర్లను.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులకి ఇప్పించుకుంటున్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఆ తర్వాత మంత్రి ఓ ఎస్ డి తర్వాత ఆమె ప్రభుత్వంపై వ్యతిరేకత కొనసాగిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఎన్నో పార్టీలు మారిన ఆమె మరోసారి పార్టీ మారుతుందా? అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆమె కూతురు సుస్మిత పటేల్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో తమకు ప్రశాంతంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై తీవ్రంగా చర్చి సాగుతోంది. మరోవైపు మేడారం పనులను ఆర్ అండ్ బి కి అప్పగించడం పై తన ప్రాధాన్యతను తగ్గించారా? అన్న చర్చ సాగుతోంది. గతంలోనూ బి.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న సమయంలో తనను పట్టించుకోవడం లేదన్న కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై విరుచుకు పడడంపై తన భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఈ విషయం అధిష్టానం వద్దకు వెళ్లడంతో.. ప్రస్తుతం కొండా సురేఖ విషయంలో సామరస్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి ఇటువంటి వివాదం ఏర్పడితే అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈలోపే కొండా సురేఖ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఎందుకంటే సాక్షాత్తు తన కూతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో పార్టీ సైతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.