Vemulawada: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం. నిత్యం వేల మంది స్వామివారి దర్శనానికి వస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా వస్తారు. అయితే ఇటీవలే ఆలయ విస్తరణ పనులు చేపట్టారు. దీంతో భీమేశ్వరాలయంలో దర్శనాలు కల్పిస్తున్నారు. అయితే బుధవారం(నవంబర్ 12) తెల్లవారుజాము నుంచి అధికారులు భక్తులకు దర్శనాలు నిలిపవేశారు. దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
యథావిధి పూజలు..
భక్తుల ప్రవేశం నిలిపివేసినా ఆలయంలో ప్రతిరోజు జరుగే వైదిక కార్యక్రమాలు, కైంకర్యాలు అర్చకులు మార్పు లేకుండా నిర్వహిస్తున్నారు. పవిత్రత కాపాడేందుకు ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. విస్తరణ పనుల భద్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణం చుట్టూ ఇనుప రేకులతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం సహా అన్ని మార్గాల గేట్లు మూసివేయబడగా, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దర్శనాలు నిలిపిన నేపథ్యంలో, ఆలయం ముందు ప్రచార రథం, ఎలక్ట్రానిక్ తెర(ఎల్‌ఈడీ)ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భక్తులు స్వామివారి ప్రత్యక్ష రూపాన్ని వీక్షించే అవకాశం కల్పించారు.
భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు..
శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సేవలు, కోడె మొక్కులు, విరాళాల స్వీకరణ కోసం సమీపంలోని శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో అన్ని సదుపాయాలు కల్పించారు. భక్తులు అక్కడి ద్వారానే సేవలకు నమోదు చేసుకోవచ్చు. అభివృద్ధి పనులు, భద్రతా అంశాలను ఆలయ ఈవో రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షిస్తున్నారు. వారితోపాటు సీఐలు, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ విజయప్రకాశ్ తదితర అధికారులు సదరు ప్రాంతంలో సమీక్ష నిర్వహించారు.