Vemulawada Rajanna temple: తెలంగాణలో దేవాలయాల పునర్నిర్మాణం అంటేనే రాజకీయాలు, భక్తుల మనో భావాలు ముడిపడి ఉంటాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదగిరిగుట్టను యాదాద్రిగా పునర్నిర్మించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నింటిని ప్రణాళికాబద్ధంగా అధిగమిస్తూ ముందుకు సాగారు. చివరకు పూర్తి చేశారు. అయితే తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ ఆలయ అభివృద్ధికి పూనుకున్నాడు. కానీ యాదగిరి తరహాల్లో కాకుండా అడ్డదిడ్డంగా సాగుతున్నాయి. దీంతో మంచి పేరు వస్తుందనుకున్న కాంగ్రెస్ సర్కార్‌కు ఆదిలోనే ఆటంకాలు తప్పడం లేదు.
యాదగిరిగుట్ట మోడల్..
బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) హయాంలో యాదగిరిగుట్టను దాదాపు రూ.1,600 కోట్లతో అభివృద్ధి చేశాడు. మొత్తం రూపురేఖలే మార్చేశాడు. అథారిటీ ఏర్పాటు చేసి, తన ఆధీనంలోనే పనులు జరిగేలా చూశాడు. గుట్ట కింద పుష్కరిణి, కల్యాణమండపాలు, విల్లాలు లాంటివి కట్టి ఆధునికంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా బాలాలయం నిర్మించి, విగ్రహాలను తరలించి, పూజలు ఆగకుండా పునర్నిర్మాణం చేశాడు. ఇది శాస్త్రోక్తంగా అభినందనీయం. ఇదే సమయంలో స్తంభాలపై తన చిత్రాలు, పథకాల ప్రకటనలు పెట్టడం రాజకీయ రంగు పునుముకుంది. భక్తుల సదుపాయాలు కొన్ని చోట్ల లోపించాయి, నాణ్యత సమస్యలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. పేదల దేవుడిని ధనికుల స్థలంగా మార్చేశాడన్న విమర్శలు వచ్చాయి. ప్రారంభోత్సవాన్ని పార్టీ కార్యక్రమంగా చేశాడు, గవర్నర్‌ను అవమానించినట్టు జరిగింది. అయినా, మొత్తంగా చూస్తే సంకల్పం బలంగా ఉండటంతో పని సాఫీగా సాగింది.
శైవక్షేత్రాలపై నిర్లక్ష్యం..
కేసీఆర్ యాదగిరిగుట్టపై ఫోకస్ పెట్టి, వేములవాడ, భద్రాచలం లాంటి శైవ–వైష్ణవ క్షేత్రాలను పట్టించుకోలేదు. వేములవాడకు ఏటా వంద కోట్ల చొప్పున రూ.500 కోట్లు ఇస్తానని చెప్పాడు. భద్రాచలం రాములవారి కళ్యానానికి ముత్యాల తలంబ్రాలు తీసుకువెళ్లి మరచిపోయాడు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించింది. ఇది మంచిపరిణామం. ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. కానీ అమలులో గందరగోళం ప్రధానం. బాలాలయం కట్టకుండా భీమేశ్వరాలయంలోకి మూర్తులను మార్చడం శృంగేరి పీఠం సలహా పేరిట జరుగుతోంది. కోడె మొక్కులు ఎక్కడ చెల్లించాలని భక్తులు గందరగోళపడుతున్నారు. స్థానికులు, రాజకీయవేత్తలు అభ్యంతరాలు చెబుతున్నారు. ఈవో ఒక మాట, కమిషనర్ మరొకటి, లోకల్ నాయకులు ఇంకోటి – ఎవరికీ స్పష్టత లేదు. ఇప్పుడు ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టి శివయ్య దర్శనం కల్పిస్తామంటున్నారు. గర్భాలయంలో శివయ్యకు పూజలు ఆగవంటున్నారు.
భక్తుల్లో డైలమా..
అభివృద్ధి పేరిట రోడ్ విస్తరణకు వందకు పైగా భవనాలు కూల్చేశారు. నెలన్నర గడిచినా టెండర్లు లేవు, పనులు మొదలు కాలేదు. శిథిలాల మధ్య వ్యాపారులు తలపట్టుకుని కూర్చున్నారు. ఇది ప్రణాళిక లోపానికి నిదర్శనం.
ముందు కూల్చి, తర్వాత ఆలోచన..
ఆలయ అభివృద్ధి పట్టించుకోవాల్సిన బాధ్యత మంత్రి కొండా సురేఖది. కానీ ఆమె వరంగల్‌పై ఫోకస్ పెట్టింది. మేడారం సమ్మక్క, సారలమ్మ భద్రకాళి గుడి సమస్యలపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో చివరకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా మంత్రి తీరుపై సీరియస్ అయ్యారు.
రేవంత్ ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో అడుగు వేసింది కానీ, అమలు దిక్కుతెలియకుండా సాగుతోంది. యాదగిరిగుట్టలా స్పష్టత, శాస్త్రోక్తం పాటిస్తే భక్తులు సంతోషిస్తారు. ఇప్పుడు సరిచేసుకుంటే మంచి పేరు వస్తుంది, లేకపోతే మరిన్ని విమర్శలు, ఇబ్బందులు తప్పవు.