HomeతెలంగాణKCR: అపర భగీరథుడు కేసీఆర్ ఇంటికే నీటి కష్టాలు.. కాంగ్రెస్ సర్కార్ లో అంతే బై

KCR: అపర భగీరథుడు కేసీఆర్ ఇంటికే నీటి కష్టాలు.. కాంగ్రెస్ సర్కార్ లో అంతే బై

KCR: ” పది సంవత్సరాలు తెలంగాణ ఎట్లుండే. నీళ్ల తండ్లాట ఉండెన. కరెంటు కోతలు ఉండెన. కంటి నిండా నిద్ర, చేను నిండా నీళ్లు, కావలసినంత కరెంటు.. కానీ ఇప్పుడు ఎలా ఉంది? దయచేసి ప్రజలు గమనించాలి. చర్చ పెట్టాలి. పోరాటాలు చేయాలి” ఇవీ కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు. రాష్ట్రం మొత్తం ఏమో గాని.. కేసీఆర్ సొంత ఇంట్లోనే తాగునీటికి కరువు వచ్చింది. తాగునీటి ట్యాంకర్ వస్తే తప్ప అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలో సాగునీటి కరువును జయించామని.. అప్పట్లో పేజీలకు పేజీలో ప్రకటనలు, పుంఖానుపుంఖాలుగా వార్తలు రాయించుకున్న కేసీఆర్.. తనే తాగునీటి కరువును ఎదుర్కొంటుండడం విశేషం. హైదరాబాదులోని నంది నగర్ లో కేసీఆర్ ఉంటున్న నివాసంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది కార్యకర్తలు ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు.. ఆ నివాసంలో తాగునీటి ట్యాంకర్ కనిపించింది. విషయం ఏంటని ఆరా తీస్తే.. కేసీఆర్ ఉంటున్న ఇంట్లో బోరు లో నీరు ఇంకిపోయిందట. తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడిందట. అందువల్లే ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని తెప్పించుకుంటున్నారట. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి.

అసలే కేసీఆర్.. మొన్నటిదాకా తెలంగాణకు ముఖ్యమంత్రి.. బంగారు తెలంగాణ ఆవిష్కర్త.. కోటి ఎకరాల మాగాణాన్ని సృష్టించిన ఆధునిక రైతు.. ఆయన ఇంట్లో నీటి కరువు ఏర్పడటం.. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఒక్కసారి గా సోషల్ మీడియాలో సర్కులేట్ కావడంతో చర్చ మొదలైంది..”కాంగ్రెస్ పరిపాలనలో ఇలానే ఉంటుంది. అధికారంలోకి వచ్చి మూడు నెలల కాకముందే నీటి కరవంటే తెలుస్తోంది. దానివల్ల సామాన్య ప్రజల నుంచి కేసీఆర్ వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియోలు, ఫొటోలు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయని” భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ అనుకూల నెటిజన్లు.. భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్ల పై విరుచుకుపడుతున్నారు. “10 సంవత్సరాల పరిపాలన గొప్పగా చేశామని చెప్పుకున్నారు. తెలంగాణకు సాగునీటిని తీసుకొచ్చామని చెప్పారు. భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. కానీ మూడు నెలల్లోనే నీటి సమస్యను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ఇదీ మీ పరిపాలన ఘనతంటూ” వారు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఇంట్లో తాగునీటి సమస్య కూడా రాజకీయ అంశంగా మారింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదానికి దారితీస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular