Land Irregularities : సర్కారు సొమ్ముకు ఎసరుపెట్టు.. కెసిఆర్ చెప్పే తెలంగాణ మోడల్ కనికట్టు

జరిగిన పనిని జరిగినట్టు చూపించి ఆల్రెడీ అయిపోయిన పనికి డబ్బులు ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు.. బహుశా కెసిఆర్ చెప్పే తెలంగాణ మోడల్ అంటే ఇదే కాబోలు.

Written By: Bhaskar, Updated On : May 1, 2023 4:18 pm
Follow us on

Land Irregularities : అదేదో సినిమాలో తనికెళ్ల భరణి ” నాకు ఒక బుల్లి చెల్లి.. హైదరాబాద్ గల్లీలో పెళ్లి. జరగాలి మళ్ళీ మళ్ళీ” అని అంటాడు కదా! సరిగ్గా అలానే ఓ తెలంగాణ మంత్రి రెడ్డి పూర్తయిన పనులను పూర్తికాని జాబితాలో చేర్చి, సర్కార్ ద్వారా మళ్ళీ మళ్ళీ బిల్లులు మంజూరయ్యేలా చేసుకుంటున్నాడు.. మొన్ననే కృష్ణానది తీరంలో 186 ఎకరాలు ఆక్రమించి చుట్టూ ప్రహరీ కట్టినట్టు వచ్చిన ఆరోపణలు మరవకముందే, తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడం విశేషం.

ఇంటి పిల్లోడికి కట్టబెట్టారు

ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి  ఫామ్ హౌస్ వ్యవహారంపై రగడ జరిగింది.. అయితే ఆ సమయంలో తన “ఇంటి పిల్లోడు” అని ఒక వ్యక్తిని పేర్కొన్నారు.. ఆ వ్యక్తి పేరు గౌడు నాయక్. నిరంజన్ రెడ్డి సొంత జిల్లా అయిన వనపర్తి లో వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో పెద్దమందడి మండలం వీరాయిపల్లి గ్రామంలోని ఒక గుట్టను 2021లో చదును చేశారు. ఈ పనులకు సంబంధించి 40 లక్షలు నిధులు 2021 డిసెంబర్ 18న జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ “ఏ/5 పీజే టీ ఎస్ ఏ ఈ యూ” పేరుతో డిపాజిట్ గ్రాంట్/2021 పేరిట మంజూరయ్యాయి. వాస్తవానికి 40 లక్షల పనులు ఉంటే టెండర్లు కచ్చితంగా పిలవాలి. అని ఇక్కడ అలా పిలవలేదు. అలా పిలవకుండానే ఆ పనులను ఒక్కొక్కటి ఐదు లక్షల ఖర్చు అయ్యేలా చూపుతూ 8 పనులుగా విభజించారు. నామినేషన్ పద్ధతిలో కేటాయించారు. ఈ పనులు కేటాయించింది ఎవరికయ్యా అంటే మంత్రి నిరంజన్ రెడ్డి తన ఇంటి పిల్లోడుగా చెప్పుకునే అంలా వత్ గౌడ్ నాయక్ కు. వాస్తవానికి ఇక్కడ ఐదు లక్షల చొప్పున 8 పనులు మొత్తం గౌడ్ నాయక్ కు కేటాయిస్తూ 2021 డిసెంబర్ 28న గ్రామపంచాయతీ 8 తీర్మానాలు కూడా చేసింది. అని ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ నిధులు మంజూరు కావడానికి ముందే అంటే 2021 లోనే పనులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ అక్టోబర్ నెలల నాటికే గుట్ట చదును పనులు పూర్తయిపోయాయి. అంతేకాదు నిధులు మంజూరైన 18వ తేదీ నాటికి అంటే రెండు రోజుల ముందే 2021 డిసెంబర్ 16న మంత్రి నిరంజన్ రెడ్డి ఆ పనులు పరిశీలించడం ఇక్కడ విశేషం.

అప్పటికే ఆ పనులు మొత్తం పూర్తయ్యాయి.. అయినప్పటికీ వాటిని కొత్త పనులుగా పేర్కొంటూ 2021 డిసెంబర్ 18న 40 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు తాలూకు కాపీ

పనులను మంత్రి పరిశీలించారు

ఇక మంత్రి పరిశీలించిన పనులకు సంబంధించిన వార్త కథనాలు అన్ని పేపర్లలో ప్రచురితమయ్యాయి. అయితే ఇక్కడ అయిపోయిన పెళ్ళికి భాజాలు మోగినట్టు పనులు అయిపోయిన తర్వాత కొత్తగా నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఇంకా మొదలు కాని.. తన ఇంటి పిల్లోడు అప్పటికే చేసిన పనులను మంత్రి పర్యవేక్షించారన్నమాట. అంటే ముందు పనులు చేయించేసి, తర్వాత జీవో ఇప్పించి, పనిని ముక్కలు చేయించి, ప్రక్రియకు బదులు నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయింపజేసుకొని బిల్లులు ఇప్పించుకున్నారన్నమాట. ఇది ఒకటే మాత్రమే కాదు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో చేపట్టే మరికొన్ని పనులు కూడా నామినేషన్ పద్ధతిలో గౌడ నాయక్ పేరుతోనే చేయించినట్టు ప్రచారం జరుగుతుంది. పైగా అలాంటి వారికి బిల్లులు కూడా ఇట్టే మంజూరయిపోతున్నాయి.

గౌడ నాయక్ పేరుతో 2021 డిసెంబర్ 28న వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం పనులకు పంచాయతీ చేసిన తీర్మానం కాపీ

పద్ధతి తప్పుతోంది

అభివృద్ధి పనులు ప్రభుత్వం మంజూరు చేశాక జరిగితే ఏమిటి? అనుమతులు రాకముందే సర్పంచ్ లు తమ సొంత డబ్బులతో చేస్తే ఏమిటి? తర్వాత ఎప్పటికైనా బిల్లులు చెల్లిస్తున్నారు కదా? లోగా ప్రజలకు మంచి జరుగుతుంది కదా? అని చాలామంది ప్రశ్నించవచ్చు. కానీ పద్ధతి ప్రకారం జరిగే పనులపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఏరోజు ఎంత పని జరిగింది? అనే దానిపై ఒక లెక్క ఉంటుంది. పనులు మొత్తం నాణ్యంగా జరుగుతున్నాయా అనే పరిశీలన ఉంటుంది. ఆ వివరాలు మొత్తం ఎం బుక్ లో రికార్డ్ అవుతుంటాయి. వాటి ఆధారంగానే బిల్లులు మంజూరు చేస్తారు. అదే పద్ధతి తప్పి పనులు చేస్తే పైవేవీ ఉండవు. తీరా ఆ పనులు పూర్తయిన తర్వాత బిల్లులు మంజూరు చేయడం తప్ప అధికారులు చేసేది ఏమీ ఉండదు.. ఇలా వనపర్తి వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలో తీర్మానం లేకుండా ఎన్నో అభివృద్ధి పనులను సర్పంచ్ మీద ఒత్తిడి తెచ్చి మరీ చేయిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు నోటిమాటగా చెబుతుండడంతో సర్పంచులు తమ జేబులో డబ్బులతో ఆ పనులు పూర్తి చేస్తున్నారు. తర్వాత కొంతకాలానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. తర్వాత ఆ పని కొత్తగా చేస్తున్నట్టు గ్రామపంచాయతీలో తీర్మానం చేస్తున్నారు. జరిగిన పనిని జరిగినట్టు చూపించి ఆల్రెడీ అయిపోయిన పనికి డబ్బులు ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు.. బహుశా కెసిఆర్ చెప్పే తెలంగాణ మోడల్ అంటే ఇదే కాబోలు.