Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భాగ్యనగరంలో మరో గంటపాటు వర్షం కుండపోతగా పడనున్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రాజధానిలో పలుచోట్ల 10 సెంటిమీటర్లకుపైగా వర్షం కురుస్తుందని అంచనా వేసింది. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్, ఆరెంజ్, ఎల్లో అల్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ 040–2111 1111కు ఫోన్ చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. ఈవీడీఎం కంట్రోల్ రూమ్ 9000113667కు ఫోన్ చేయాలన్నారు. హైదరాబాద్ వాసులు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
అన్ని శాఖలు అప్రమత్తం..
భారీ వర్షాలతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో మాట్లాడిన మంత్రి.. ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలన్నారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
పొంగుతున్న వాగులు..
సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. ఇప్పటికే రెండు జలాశయాలు పూర్తిగా నిండగా.. మరో రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ హెచ్చరించారు.
22 గంటల్లో నమోదైన వర్షపాతం.
చందానగర్ సర్కిల్ 14.1 సెం.మీ., కూకట్‌పల్లి సర్కిల్ 12.7 సెం.మీ., రాజేంద్రనగర్ సర్కిల్ 12 సెం.మీ. జూబ్లీహిల్స్ సర్కిల్ 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. యూసుఫ్‌గూడ సర్కిల్ 11.7 సెం.మీ., మూసాపేట సర్కిల్ 11 సెం.మీ., గాజులరామారం సర్కిల్ 11 సెం.మీ., కుత్బుల్లాపూర్ సర్కిల్ 10.7 సెం.మీ., చందానగర్ సర్కిల్ 10.7 సెం.మీ., ఖైరతాబాద్ సర్కిల్ 10.2 సెం.మీ., శేరిలింగంపల్లి సర్కిల్ 10.1 సెం.మీ. వర్షపాత నమోదైంది.
జనజీవనం అస్తవ్యస్తం..
హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్థమైంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్లపై వరదతో వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే ఉంటున్నాయి. నిదానంగా వాహనాలు కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంత శ్రమిస్తున్నా.. వరద కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు.