Venu Swamy Astrology: మొత్తానికి వేణు స్వామి యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సంచలన విషయాలు చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు.. చెప్పిన లెక్కలు సంచలనంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి వేణు స్వామి మాట్లాడిన మాటలు చర్చకు దారితీస్తున్నాయి.
కొంతకాలంగా భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ తప్పుపడుతోంది. ఇదే క్రమంలో తన పార్టీ సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీ మీద దుమ్మెత్తి పోస్తోంది. కొన్ని సందర్భాలలో గులాబీ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. సొంత పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కచ్చితంగా గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
గులాబీ పార్టీ కోరుకున్నట్టుగా అధికార పార్టీలో సంక్షోభం ఏర్పడుతుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందా? కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? ఈ ప్రశ్నలకు వేణు స్వామి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 2026 లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమీ లేదని వేణు స్వామి కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు ఈ ఏడాది మే నెలలో కేసీఆర్ తన విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెడతారని వేణు స్వామి ప్రకటించారు. 2027 లో మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. రేవంత్ రెడ్డికి సమస్యలు ఎదురైనా సరే దూసుకుపోతారని.. బండి సాఫీగానే సాగిపోతుందని వేణు స్వామి పేర్కొన్నారు..
కల్వకుంట్ల కవితకు సంబంధించి వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె కోరుకున్నట్టుగా ఏది జరగదని.. ఆమె అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆమె రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో మార్పు రాదని.. ఆమె కోరుకున్న ఫలితం దక్కదని వేణు స్వామి పేర్కొన్నారు. 2026 లో రేవంత్ వర్సెస్ కెసిఆర్ అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు సాగిపోతాయని.. గులాబీ పార్టీ కార్యకర్తలు కోరుకున్నట్టుగా సానుకూల ఫలితాలు మాత్రం రాకపోవచ్చని వేణు స్వామి అంచనా వేశారు.
ఆమధ్య టీవీ5 మూర్తితో జరిగిన వివాదం తర్వాత వేణు స్వామి అంతగా బయటికి రాలేదు. అస్సాంలో కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తున్న క్రమంలో.. అక్కడ పూజారులు వేణు స్వామిని నిలదీశారు. ఈ వీడియో మీడియాలో విస్తృతంగా రావడంతో వేణు స్వామి ఇబ్బంది పడ్డారు. కొన్ని ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చాయి. చివరికి వేణు స్వామి ఇలా బయటికి వచ్చారు. వస్తువస్తూనే తెలంగాణ రాజకీయాల మీద తనదైన భవిష్యత్తు వాణి వినిపించారు. వేణు స్వామి వినిపించిన భవిష్యత్తు వాణి ఎంతవరకు నిజమవుతుందనేది చూడాల్సి ఉంది.
