CM Revanth Reddy: మొన్నటి వరకు ఉత్తర తెలంగాణ.. ఇప్పుడు దక్షిణ తెలంగాణ.. సీఎంలు ఎటుంటే అటే అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రెండు టర్మ్‌ల్లోనూ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. అలా పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించారు.

Written By: Srinivas, Updated On : September 19, 2024 5:06 pm

CM Revanth Reddy(11)

Follow us on

CM Revanth Reddy: ‘వడ్డించే వాడు మన వాడు అయితే.. బంతిలో ఏ మూలకు కూర్చున్నా సమస్య ఉండదు’ అని సామెత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి కూడా అలానే తయారైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు అవుతోంది. కానీ.. అభివృద్ధి మాత్రం ఎప్పుడూ ఒకేచోట దగ్గర నిలిచిపోతోంది. ఒకే ప్రాంతానికి పరిమితం అవుతోందనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగిన సందర్భంలో కేవలం ఆంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యత దక్కిందనే అభిప్రాయం ఉండగా.. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇరు ప్రాంతాలకు సరైన ప్రాధాన్యత చేకూరడం లేదనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోంది. అయితే.. ఏ నాయకుడైనా తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకోవడం కామన్. కానీ.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి పక్షపాతం చూపడం ఎంతవరకు సమంజనం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రెండు టర్మ్‌ల్లోనూ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. అలా పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించారు. అయితే.. ప్రజాస్వామిక సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ కేవలం ఒక ప్రాంతానికే పెద్దపీట వేశారని చాలా వరకు విమర్శలు వచ్చాయి. ఆయన కేవలం ఉత్తర తెలంగాణకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని.. దక్షిణ తెలంగాణ ఎడారి చేశారనే నినాదం చాలా వరకు వినిపించింది.

అయితే.. పార్టీలు, ప్రజల నుంచి ఆరోపణలు ఎలా ఉన్నా.. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించనప్పటి నుంచి ఆయనకు ఉత్తర తెలంగాణ అండగా నిలుస్తూ వచ్చింది. ఆయన చేపట్టిన ప్రతీ ఉద్యమానికి మద్దతునిచ్చింది. ఆయన ఇచ్చిన ప్రతీ పిలుపులోనూ భాగమైంది. అందుకే.. ఆయన ఎలాంటి నిరసనలు చేపట్టాలన్నా.. అప్పటి ప్రభుత్వంపై ఏ వాయిస్ వినిపించాలన్నా ఉత్తర తెలంగాణను వేదికగా చేసుకునే వారు. ఉత్తర తెలంగాణలో చేపట్టిన ఉద్యమంతోనే ఆయన సక్సెస్ అయ్యారనేది ఆయన నమ్మకం. ఉద్యమం సమయంలోనూ దక్షిణ తెలంగాణ నుంచి పెద్దగా సపోర్టు లభించలేదనే ఫీలింగ్ ఆయనలో కనిపిస్తుండేది.

ఆ తరువాత అధికారం చేపట్టాక కూడా.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉత్తర తెలంగాణకే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ప్రభుత్వం ఏ నూతన కార్యక్రమాన్ని రూపొందించినా దానిని ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. ఏ పథకాన్ని అమలు చేయాలనుకున్నా దానికి ఉత్తర తెలంగాణనే వేదికగా చేసుకునే వారు. ఇక్కడి నుంచి ప్రారంభించిన పథకాలు ఏవైనా సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతాయని ఆయన నమ్మేవారు. ఆయనకు ఉత్తర తెలంగాణ అంటే అంత సెంటిమెంట్ మరి. దాంతో ఆయన హయాంలో అభివృద్ధి మొత్తం ఉత్తర తెలంగాణకు పరిమితమైంది. దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని ఆ పరిధిలోని నేతలు, ప్రజలు అంటుంటారు. అందుకే.. కొత్త కొత్త పథకాలైనా, ప్రాజెక్టులైనా ఉత్తర తెలంగాణకే పరిమితం చేశారని ఆరోపించారు.

అయితే.. దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాడు. ప్రభుత్వం కొలువుదీరి కూడా పది నెలలు కావస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపైనా అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. గత ముఖ్యమంత్రి ఉత్తర తెలంగాణకు అభివృద్ధిని పరిమితం చేస్తే.. రేవంత్ దక్షిణ తెలంగాణకే అన్ని సమకూరుస్తున్నాడని పెద్ద ఎత్తున నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. రెండు ప్రాంతాలను రెండు కళ్లలా చూడకుండా.. కేవలం దక్షిణ తెలంగాణ వైపే చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న దక్షిణ తెలంగాణ పరిధిలోనే ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే.. రీజినల్ రింగ్ సహా అంతర్జాతీయ స్టేడియం ప్రాజెక్టులన్నీ దక్షిణ తెలంగాణకు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. ఆయన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిని సోలరైజ్డ్ విలేజీగా మార్చేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇలా.. ఒక్కొక్కటిగా దక్షిణ తెలంగాణనే అభివృద్ధి చేయాలని చూస్తుండడంతో నాటి సీఎంకు, ఈ సీఎంకు తేడా ఏం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.