Jamili Election : కేంద్రం ఎదుట జమిలి సవాళ్లు.. వాటిని అధిగమిస్తేనే వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌!

దేశంలో ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, ఏక కాలంలో మున్సిపాలిటీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. 2029లో జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే దీనిని సాధ్యం చేయడానికి కేంద్రం పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : September 19, 2024 1:56 pm

one Nation One Election

Follow us on

Jamili Election :  జమిలి ఎన్నికలంటే.. పార్లమెంటుతోపాటే.. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఇది భారత దేశానికి కొత్త కాదు. 1951 నుంచి 1967 వరక దేశంలో జమిలి ఎన్నికలే జరిగాయి. తర్వాత కొత్త రాష్ట్రాలు ఏర్పడడం, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేయడం వంటి కారణాలతో మధ్యంత ఎన్నికలు వచ్చాయి. దీంతో జమిలి ఎన్నికలు కనుమరుగయ్యాయి. ఇక పలు రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. అయితే మళ్లీ కేంద్రం జమిలి ఎన్నికలను తెరపైకి తెస్తోంది. పార్లమెంటుతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వమించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం పెంచడమో.. తగ్గించడమో చేయాలి. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇది జరగాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి.

వీటిని సవరించాలి..
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాలి. రాజ్యాంలో ఆరు సరవణలు చేయాల్సి ఉంటుంది.

1. ఆర్టికల్‌ 83(లోక్‌సభ, రాజ్యసభ కాల పరిమితికి సంబంధించినది)

2. ఆర్టికల్‌ 172(1) (రాష్ట్రాల అసెంబ్లీల గడువుకు సంబంధించినది)

3. ఆర్టికల్‌ 83(2) అత్యవసర పరిస్థితుల సమయంలో లోక్‌సభ కాలపరిమితి ఏడాదికి మించకుండాడ పెంచేందుకు వీలుకల్పించేది. ఆర్టికల్‌ 172(1) కింద రాష్ట్రాల అసెంబ్లీలకు ఇలాంటి అవకాశం ఉంది.

4. ఆర్టికల్‌ 85(2) (బి) రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేసే అధికారం కల్పించేది. ఆర్టికల్‌ 174(2)(బి) రాష్ట్రాల అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్లకు కల్పించేది.

5. ఆర్టికల్‌ 356 (రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించేది)

6. ఆర్టికల్‌ 324 ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించింది.

పార్లమెంటులో 2/3 మెజారిటీ అవసరం..
ఇదిలా ఉంటే.. రాజ్యాంగ సవరణలకు పార్లమెంటులో 2/3 మెజారిటీ ఆమోదించాలి. ప్రస్తుతం లోక్‌సభలరాజ్యాంగ సభరణ బిల్లులు ఆమోదం పొందాలంటే బీజేపీకి సొంత బలం చాలదు. అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టాలి. రాజ్యసభలో అయితే మరింత ఎక్కువ కష్టపడాలి. లోక్‌సభలో ప్రస్తుతం ఎన్డీఏ బలం 293. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి 362 మంది సభ్యులు అవసరం. ఇక రాజ్యసభలో ఎన్డీఏ బలం 121. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి 164 మంది మద్దతు అవసరం.

రాష్ట్రాలనూ ఒప్పించాలి..
మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. సమాఖ్య వ్యవస్థ. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మాటకూ విలువ ఉంటుంది. అంటే జమిలి ఎన్నికలకు రాష్ట్రాలనూ ఒప్పించాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. అంటే 14 రాష్ట్రాల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రాష్ట్రాల మద్దతు సులభమే.

ఆయుధాలన్నీ అప్పటికే..
ఇదిలాఉంటే జమిలి ఎన్నికల నాటికీ కీలయ ఆయుధాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిది చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు. రెండోది లోక్‌సభ సీట్ల పెంపు. ఈ రెండు అమలు చేసిన తర్వాతనే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2023 సెప్టెంబర్‌ 21న మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అయితే అమలు మాత్రం వాయిదా వేసింది. దీనిని వచ్చే ఎన్నికల్లో అమలు చేయనున్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన 2026లో చేపట్టే అవకాశం ఉంది. అంటే జమిలి ఎన్నికల నాటికి దేశంలో లోక్‌సభ సీట్ల సంఖ్య 750కి పెరిగే అవకాశం ఉంది.