Two Thousand Chickens: బ్రాయిలర్ చికెన్ లైవ్ ధర ప్రస్తుతం కిలోకు 120 నుంచి 130 వరకు ఉంది. అదే డ్రెస్సింగ్ చేసిన చికెన్ అయితే 220 నుంచి 250 వరకు ఉంటుంది. ప్రాంతాలను బట్టి రేటు మారుతూ ఉంటుంది. కానీ నాటు కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కిలో నాటుకోడి లైవ్ 350 నుంచి 400 వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఈ రేటు చాలా ఎక్కువగానే ఉంటుంది. వాస్తవానికి ఇంతటి ధర పలుకుతున్న నాటుకోళ్లను ఒక వ్యక్తి ఉచితంగా వదిలిపెట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వేల కోళ్లను పత్తి చేనులో వదిలిపెట్టాడు.
నాటు కోళ్లు పత్తి చేనులో కనిపించడంతో ఆ గ్రామానికి చెందిన రైతులు మొత్తం దర్జాగా పట్టుకుని వెళ్లారు.. కోసుకొని వండుకొని తిన్నారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా ఈ ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది. గడచిన శనివారం 2000కు పైగా నాటుకోళ్లను ఓ వ్యక్తి ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు.. దీంతో ఎల్కతుర్తి వాసులు మొత్తం పండగ చేసుకున్నారు. గంటల వ్యవధిలోనే ఊరు మొత్తం నాటు కోళ్లతో విందు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు.. వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
నాటు కోళ్ల కలకలం గ్రామంలో దావనం మాదిరిగా వ్యాపించడంతో పశు సంవర్థక శాఖ అధికారులు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తినకూడదని సూచించారు.. అయితే ఆ కోళ్లను పరీక్షించిన తర్వాత ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించారు.. అయితే దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.. ఇంత ధర పలుకుతున్న నాటుకోళ్లను ఉచితంగా ఎలా వదిలేస్తారు అంటూ ఆశ్చర్యపోయారు.. చివరికి పోలీసుల పరిశోధనలో ఒక రైతు ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇలా పొలాలలో నాటు కోళ్లను వదిలి వేసినట్టు తెలుస్తోంది.. రెడ్డి పురం ప్రాంతానికి చెందిన ఓ రైతు నాటు కోళ్ల ఫారం ఏర్పాటు చేశాడు. ఇటీవల వరదలో ఫామ్ లో ఉన్న కోళ్లు కొట్టుకుపోయాయి.. దీంతో మిగతా కోళ్లను కూడా ఆయన ఇలా పత్తి చేనులో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.. ఆ కోళ్లను పట్టుకుని తిని గ్రామానికి చెందినవారు పండగ చేసుకున్నారు. పోలీసులు కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఆ రైతు లబోదిబో అంటున్నాడు. ఈ విషయం తెలిసిన ఇన్సూరెన్స్ సంస్థల నిర్వాహకులు బీమా ఇవ్వడం కుదరదని చెబుతున్నట్టు తెలుస్తోంది.