Minister Tummala Lost Phone:రాజకీయ నాయకులు తమ ఫోన్ లను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రస్తుత కాలంలో ఫోన్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.. కనీసం తన వ్యక్తిగత ఫోన్లను పిఏలకు కూడా ఇవ్వడం లేదు.. కనీసం వారి పర్సనల్ నెంబర్లు పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి ఇష్టపడడం లేదు. అలాంటిది ఒక మంత్రి అధికారిక కార్యక్రమానికి వెళ్తే… అక్కడ ఆయన ఫోన్ మిస్ అయింది. ఆ విషయం చాలా సమయం తర్వాత తెలిసింది. ఈ విషయాన్ని ఆ మంత్రి గారు పోలీసులకు చెప్పడంతో.. పెద్ద స్టోరీ నడిచింది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకరపట్నం మండలం కేశవపట్నం లో ఆదివారం పర్యటించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ మంజూరు చేసిన నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని.. ఇందులో భాగంగా హామీ ఇచ్చినట్టుగానే రేషన్ కార్డులను పంపిణీ చేసిందని మంత్రి వివరించారు. ప్రతిపక్షం అనవసరంగా ఆరోపణలు చేస్తోందని.. గడచిన పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
Also Read: కవిత vs జగదీశ్వర్ రెడ్డి.. ఫామ్ హౌస్ లో కెసిఆర్ కీలక సమావేశం.. గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?
ఆ సమావేశం ముగించుకొని మంత్రిగారు కరీంనగర్ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు తన ఫోన్ కనిపించలేదు. దీంతో మంత్రిగారి లో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే ఆయన స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. వారు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. కరీంపేట ప్రాంతంలో ఓ మహిళ వద్ద మంత్రి ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. దానిని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే మంత్రిగారి ఫోన్ అలా ఎలా మాయమైంది.. ఆ మహిళ దగ్గరికి ఎలా వెళ్ళింది.. అనే విషయాలను బయటికి చెప్పడానికి పోలీసులు ఇష్టపడడం లేదు. రేషన్ కార్డుల పంపిణీ సమయంలో రద్దీ ఏర్పడడం వల్లే మంత్రిగారి ఫోన్ తస్కరణకు గురైందని తెలుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీ హడావిడిలో పడి మంత్రిగారు కూడా ఫోన్ గురించి పట్టించుకోలేదని.. తిరుగు ప్రయాణంలో ఆయనకు గుర్తొచ్చి చూసుకోగా ఫోన్ కనిపించలేదని.. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఫోన్ ఆచూకీ తెలుసుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా మంత్రిగారి ఫోన్ పోయిన వ్యవహారం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.