Trump Who Wants To Change The Constitution: హోరాహోరీ పోరులో ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దాంతో రెండో సారి ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబోతున్నారు. వచ్చే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే.. అధ్యక్ష పీఠంపై కూర్చోబోయే ముందు తన టీమ్‌ను ట్రంప్ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే తన కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలో ఓ నిర్ణయానికి సైతం వచ్చినట్లు తెలుస్తున్నది. అంతేకాదు.. కొంత మంది పేర్లను ప్రకటిస్తూనే ఉన్నారు. నిన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామిని తన కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే.. ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా హిందూ మహిళను నియమించారు. తులసీ గబ్బార్డ్‌కు ఆ పోస్ట్ అప్పగించారు.
ట్రంప్ అంటేనే దూకుడు నిర్ణయాలకు కేరాఫ్. 80 ఏళ్లలోనూ రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. ఇప్పుడు కూడా తన పంథాలోనే సాగుతున్నారు. ఏ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మూడోసారి కూడా ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఈ విషయంలో ఆయన రిపబ్లికన్లను సైతం రెచ్చగొట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మూడోసారి పోటీచేస్తే తప్పేంటని నిలదీస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్ని సార్లు పోటీ చేసినప్పటికీ అధ్యక్ష పదవిని మాత్రం రెండుసార్లే చేపట్టాలి. మూడో సారి అవకాశం లేదు. రెండుసార్లు అధ్యక్షుడు అయిన వారికి మూడో సారి ఎన్నికయ్యే అర్హత ఉండదు. అయితే.. మూడో సారి పోటీపై ట్రంప్ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది.
నాలుగేళ్ల తరువాత కూడా తాను మూడోసారి పోటీ చేస్తానని ట్రంప్ అంటున్నారు. అవసరం అయితే రాజ్యాంగాన్ని కూడా మారుస్తాను అన్నట్లుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాను మూడోసారి పోటీ చేసేందుకు ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి.. ఆ తరువాత ప్రజాభిప్రాయం మేరకు మరోసారి పోటీ చేస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికా రాజ్యాంగాన్ని మార్చడం అంత ఈజీ కాదు. సెనెట్‌తోపాటు ప్రతినిధుల సభలోనూ బిల్లుకు మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. ఇప్పుడు రెండు సభల్లోనూ రిపబ్లికన్లకు మెజార్టీ ఉంది. అయితే.. మూడింట రెండొంతుల మెజార్టీ మాత్రం లేదు. అదే సమయంలో మొత్తం 50 రాష్ట్రాలలో 75 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. రాష్ట్రాల నుంచి అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా అన్న నమ్మకం లేదు. ఒకవేళ ట్రంప్ కనుక ఇలాంటి ప్రయత్నాలకు పోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్లలో అమెరికా ప్రజలను గందరగోళానికి గురిచేసిన ట్రంప్.. ఈ టర్మ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎలా ఆడుకుంటారా అని గందరగోళం కనిపిస్తోంది. అటు వివిధ దేశాల విషయంలోనూ ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయా అన్న చర్చ ఇప్పటినుంచే నడుస్తున్నది. ఇప్పటికే వలసవాదులపై బాంబు పేల్చిన ట్రంప్.. ముందు ముందు ఏ దేశానికి షాక్ ఇవ్వబోతున్నారా అని అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు.