Heavy Rains(2)
Heavy Rains: భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న కుంభ వృష్టితో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగులు, వంకలు, నదులు పొంగి పోర్లుతున్నాయి. రికార్డు స్థాయి వరదలతో రోడ్లు, రైలు మార్గాలు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు, పట్టణాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు, చిమిర్యాల వాగులు పొంగడంతో జాతీయ రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. తెలంగాణ, ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు పొంగి ప్రవహిస్తుంది. కోదాడ నుంచి వరదనీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
కొట్టుకుపోయిన వంతెన..
హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద 65వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మోకాళ్ల లోతులో వరద ప్రవహిస్తుండడంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద, హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. వరద తగ్గేవరకు హైవేపై వాహనాలను అనుమతించమని అధికారులు వెల్లడించారు. మున్నేరు వరద పెరగడంతో రామాపురం వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోని 30 మంది ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
డోర్నాల–శ్రీశైలం మధ్య రాకపోకలు బంద్
భారీ వర్షాలకు ఆత్మకూరు–డోర్నాల, డోర్నాల–శ్రీశైలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ మార్గాల్లో పలుచోట్ల రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భవనాశి వాగు పొంగడంతో ఆత్మకూరు–కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఆత్మకూరు–దుద్యాల, ఆత్మకూరు–వడ్లరామాపురం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గుండ్లకమ్మ వాగు పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్–వరంగల్ హైవేపై రఘునాథ్‌పల్లి వద్ద భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం వైపు వెళ్లొద్దని నాగర్ కర్నూల్ పోలీసులు హెచ్చరించారు. భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే ఆ మార్గంలో ప్రయాణించొద్దని సూచించారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Traffic between ap and telangana stopped due to heavy rains
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com