Mallojula Venugopal Rao Surrendered: అతడు ఉన్నత చదువులు చదివాడు.. ఆ కాలంలో చుట్టూ అన్యాయం రాజ్యమేలేది. అన్యాయం తాండవం చేసేది. అక్రమం అంతటా కనిపించేది. ఇవన్నీ కూడా ఆయనకు ఇబ్బందిగా అనిపించేవి. పీడిత పక్షాల కోసం.. బాధిత పక్షాల కోసం పోరాటం చేయాలి అనుకున్నాడు. అందుకు తుపాకీ నే మార్గమని భావించాడు. ఉన్నత చదువులు చదివిన అతడు పేదల కోసం.. పీడిత పక్షాల కోసం తుపాకీ పట్టుకొని అడవుల్లోకి బయలుదేరాడు. అన్నలలో కలిశాడు. తనే ఒక అన్నగా మారిపోయాడు. సుదీర్ఘకాలం అడవుల్లోనే ఉన్నాడు. పోరాట పంథా తోనే సమ సమాజం సాధ్యమని అనుకున్నాడు. కాని చివరికి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా మల్లోజుల వేణుగోపాలరావు తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు, దట్టమైన అడవులు ఉన్న రాష్ట్రాల ప్రజలకు కూడా సుపరిచితుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కోయ భాషలను వేణుగోపాల్ రావు అనర్గళంగా మాట్లాడగలరు. పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా వేణుగోపాలరావు కొనసాగుతున్నారు. అనేక ఉద్యమాలలో.. హింసాత్మక ఘటనలలో వేణుగోపాలరావు ముఖ్యపాత్ర పోషించారు. అయితే ఆయన ఇప్పుడు లొంగిపోయారు. 60 మంది దళ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి విజయవర్మ అధికారికంగా ధ్రువీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవాలని.. వేణుగోపాలరావు తీసుకుని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు మావోయిస్టులు ఎంచుకున్న మార్గం అంతం కావాలని.. ఇదే విషయాన్ని దండకారణ్య ప్రజలు కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.
వేణుగోపాలరావు ఈ ఏడాది సెప్టెంబర్ లో కీలక ప్రకటన చేశారు. ఆయుధాలను వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని పేర్కొన్నారు. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ కమిటీ మద్దతు కూడా ఇచ్చింది. వేణుగోపాలరావు రాసిన లేఖను హిడ్మా , దేవి వ్యతిరేకించారు. ఇదంతా జరుగుతుండగానే కొద్దిరోజుల క్రితం వేణుగోపాలరావు మరో లెక్క కూడా బయటకు విడుదల చేశారు. పార్టీ చేసిన తప్పులకు క్షమించాలని కోరాడు. ఉద్యమాన్ని ఓడించినందుకు క్షమించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు.. “ఇంత నష్టం కలిగింది. ఇన్ని బలి దానాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ చేయాల్సిన పని ఆగిపోయింది. ఇకపై ఆ పని హింస ద్వారా సాధ్యం కాదని తేలిపోయింది. ప్రస్తుతం పార్టీ అత్యంత కష్టకాలంలో ఉంది. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం సరైంది కాదని అనుకోవచ్చు. కానీ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. వందలమంది మావోయిస్టులు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిడివాద, అతివాద విధానాలు మరింత బలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మిగతా వారిని కాపాడుకోవాలి. వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలి. అందువల్లే ఈ మార్గం ఎంచుకోవాల్సి వచ్చింది. విప్లవ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించాలి. ప్రజల్లోకి బహిరంగంగా తీసుకెళ్లాలి. ఇదంతా జరగాలంటే తుపాకులను వదిలేయాలి. ఇది తప్ప వేరే మార్గం లేదని” వేణుగోపాల్ అప్పట్లో రాసిన లేఖలో పేర్కొన్నారు.
వేణుగోపాల్ తెలంగాణలో పుట్టినప్పటికీ.. మావోయిస్టు పార్టీలో దినదిన ప్రవర్తమానంగా ఎదిగారు. అనేక ఉద్యమాలు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారందరికీ బహిరంగ శిక్ష విధించారు. హింసాయుత ఘటనలకు పాల్పడ్డారు. దండకారణ్యం విస్తరించిన ప్రాంతాలలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. కోవర్టులను ప్రజా కోర్టులో శిక్షించారు. అనేక బాంబు పేలుళ్ల లో కీలకపాత్ర పోషించారు. కానీ చివరికి వేణుగోపాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 60 మందితో లొంగిపోయారు. అయితే ఈ నిర్ణయాన్ని మావోయిస్టులలోని కొత్త కమిటీలు ఎలా చూస్తాయి అనేది చూడాల్సి ఉంది.