Radar Station : దామగుండం నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన.. కాలగర్భంలో మూసీ నది.. ఇందులో నిజమెంత?

సముద్ర తీర ప్రాంతంలో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో సముద్ర తీరం లేనేలేదు. అలాంటి చోట నావి రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల దామగుండం ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మాణం కాబోతోంది.

Written By: Neelambaram, Updated On : October 15, 2024 11:40 am

Radar Station

Follow us on

Radar Station : ఈ స్టేషన్ నిర్మాణం వల్ల దామగుండం అగ్నిగుండం అవుతుందా? మూసినది కాలగర్భంలో కలిసిపోతుందా? దామగుండం, మూసీ నదికి ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దామగుండం వికారాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ నావి రాడార్ స్టేషన్ నిర్మాణానికి మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణానికి నేవీకి రాష్ట్ర ప్రభుత్వం 2900 ఎకరాలు కేటాయించింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియా విస్తీర్ణం 3,261 ఎకరాలు. ఈ అడవిని ఆనుకొని దాదాపు 20 పల్లెలు ఉన్నాయి. అంతకుమించిన తండాలు ఉన్నాయి. ఈ అడవిలో స్థానిక రైతులు పశువులను మేపుతుంటారు. వంట చెరుకు కోసం ఇక్కడ ప్రజలు ఈ అడవి పై ఆధారపడుతుంటారు. ఈ అడవిలో చిన్న చిన్న కాలువలు, కుంటలు, వాగులు ఉన్నాయి. ఈ అడవిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి చోట కేంద్రం వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి రాడార్ స్టేషన్ ను సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మిస్తారు. అసలు సముద్రమేలేని తెలంగాణలో ఈ స్టేషన్ ఏర్పాటు ఎందుకనే ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.

కీలక స్థావరంగా ఎంచుకుంది

భారత నావికా దళం తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టింది. భద్రతకు కీలకమైన స్థావరంగా ఎంచుకుందని తెలుస్తోంది. దామగుండంలో నిర్మించే రాడార్ స్టేషన్ దేశంలోనే రెండవ వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ అని కేంద్రం చెబుతోంది. దీని ద్వారా ఓడలు, జలాంతర్గాములతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిపుచ్చుకుంటారు. రక్షణ రంగంతోపాటు రేడియో కమ్యూనికేషన్ అవసరాల కోసం దీనిని ఉపయోగిస్తారు. అయితే ఈ స్టేషన్ నిర్మాణం వల్ల 2,900 ఎకరాలలో 12 లక్షల చెట్లను తొలగిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల 208 రకాల కు చెందిన జీవరాశులు ప్రమాదంలో పడతాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. దాని జన్మస్థానమైన అనంతగిరి కొండల్లో అడవిని లేకుండా చేస్తోందని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ స్టేషన్ నిర్మాణం వైపే ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి.

48% మాత్రమే ఉపయోగం..

రాడార్ నిర్మాణం కోసం కేటాయించిన అటవీ భూమిలో 48 శాతం మాత్రమే ఉపయోగిస్తారట. మిగతా 52 శాతం అటవీ సంపదకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తారట. 12 లక్షల చెట్లను తొలగిస్తారని వార్తల్లో నిజం లేదట. కేవలం 1.93 లక్షల చెట్లను మాత్రమే తొలగిస్తారట. అయితే ఆ సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారట. అయితే ఆ 1.93 లక్షల చెట్లకు బదులుగా.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 2,348 హెక్టార్లలో 17.5 లక్షల మొక్కలు నాటుతారట. అంతేకాదు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లదట. 32.10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయంతో పాటు కొలను కూడా అలాగే ఉంటాయట..