Sarpanch Elections In Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంది. మొదటి విడత ఎన్నికలకు గుర్తులు కూడా కేటాయించారు. మరోవైపు రెండో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో పల్లెల్లో ఆసక్తికర పోటీ కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, అత్త కోడళ్లు పోటీలో ఉంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో అన్నదమ్ములు, అత్త కోడలు బరిలో నిలిచారు. ఇక జగిత్యాల జిల్లాలో ఒకే ఇంట్లో ముగ్గురు పోటీలో నిలిచారు.
త్రిముఖ పోటీ..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. ఈ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు – పుల్ల పుష్పలత (భార్య), పుల్ల సాయగౌడ్ (భర్త), పుల్ల వెంకటేశ్ (కొడుకు)– సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 12 మంది అభ్యర్థులు పోటీపడుతోన్న ఈ ఎన్నిక వివాదాస్పదంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఓట్ల విభజన, శక్తి పోరాటం గ్రామ రాజకీయాల్లో కొత్త విషాదాన్ని తెస్తోంది. ఈ పరిణామం స్థానిక రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
ఇటువంటి పరిస్థితులు గ్రామ ప్రజల్లో రాజకీయ ఎన్నికలపై ఆసక్తిని పెంచాయి. కానీ కుటుంబ విభేదాలకు కూడా దారితీస్తాయి. పోటీ రాజకీయ సంప్రదాయాన్ని కొద్దిగా భిన్నంగా చూపుతుంది. అయితే ఎవరు గెలిచినా పాలించేది మాత్రం ఆ కుటుంబమే. ఈ నేపథ్యంలో గ్రామాభివృద్ధిలో ఈ ఎన్నికల యొక్క ప్రభావం పై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.