Professor Nageshwar: అధ్యాపకుడిగా.. రాజకీయ విశ్లేషకుడిగా.. శాసనమండలి మాజీ సభ్యుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలుగు రాష్ట్రాల వారికి సుపరిచితులు. వర్తమాన రాజకీయ అంశాలపై తనదైన శైలిలో ఆయన విశ్లేషణ చేస్తుంటారు. ప్రైవేట్ న్యూస్ చానల్స్ కార్యాలయాలలో అప్పుడప్పుడు డిబేట్ లలో పాల్గొంటూ ఉంటారు. వాస్తవానికి ఆయన కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ఉంటారని అపవాదు కూడా ఉంది. అలాంటి విమర్శలను ఆయన లెక్కచేయరు. పైగా కొన్ని విషయాలలో కమ్యూనిస్టు పార్టీలను కూడా ఆయన తప్పు పడుతుంటారు. కొన్ని సందర్భాలలో న్యూట్రల్ గా ఉంటారు కాబట్టి చాలామంది ఆయన విశ్లేషణలను అభిమానిస్తూ ఉంటారు.
నాగేశ్వర్ విశ్లేషణలు కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు. కొంతమంది నేతలకు మింగుడు పడకపోవచ్చు. అయినప్పటికీ నాగేశ్వర్ తన ధోరణి మార్చుకోలేరు. అనేక సందర్భాలలో ఆయనపై సోషల్ మీడియాలో దాడి జరిగింది. అయినప్పటికీ ఆయన శబ్దంగానే ఉన్నారు. ఎవర్ని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయలేదు. అయితే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తొలిసారిగా గొంతు విప్పారు. అదికూడా తనకు బెదిరింపులు వస్తున్నాయని.. అంతం చేస్తామని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇలాంటి వాటికి తాను బెదిరిపోనని.. మంగళగిరి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి ఈ తరహా బెదిరింపులు ఎక్కువైపోయాయని నాగేశ్వర్ అన్నారు. అంతేకాకుండా సందేశాలు పంపించి అంతం చేస్తామని బెదిరిస్తున్నారని నాగేశ్వరరావు వాపోయారు. దానికి సంబంధించిన వాట్సాప్ సందేశాలు తన వద్ద ఉన్నాయని నాగేశ్వర్ వివరించారు.
ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కార్యాలయంలో జరిగిన డిబేట్ లో నాగేశ్వర్ పేర్కొన్నారు. అందులో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి బాగోలేదని.. వారి అనుచరులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని.. వారు తమ ధోరణి మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని నాగేశ్వర్ హెచ్చరించారు. వాస్తవానికి ఇలాంటి విశ్లేషకులు మాటలను రాజకీయ నాయకులు సానుకూల కోణంలో చూడాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నాయకులు మాత్రం వీటిని వ్యతిరేక కోణంలో చూస్తూ ఉండడంతో వివాదం ఏర్పడుతోంది. అయితే ఎమ్మెల్యేలు అలా ఉంటే.. వారి అనుచరులు మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ జాబితాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉండడం ఆందోళన కలిగించే విషయం. వాస్తవానికి నాగేశ్వర్ చేస్తున్న సూచనలను సానుకూల కోణంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి బాగుంటుంది. తప్పులు ఎవరైనా చేస్తారు.. అది మానవ నైజం కూడా. అంతోటి దానికి తప్పులు ఎత్తి చూపిన వ్యక్తులను విమర్శించడం.. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం అనేది సరైన చర్య కాదు. ఇప్పటికైనా కూటమి ఎమ్మెల్యేలు తమ ధోరణి మార్చుకుంటే మంచిది. లేకపోతే ఇటువంటి విధానాలు భవిష్యత్తు కాలంలో ఇబ్బందికి గురిచేస్తాయి. గడిచిన ఐదు సంవత్సరాలు ఎలా ఉందో ఏపీ ప్రజలు చూశారు. ఇప్పుడిప్పుడే కాస్త స్వేచ్ఛగా ఉంటున్నారు. ఇలాంటి స్థితిలో వచ్చిన మంచి పేరును కూటమి ఎమ్మెల్యేలు ఇలా పోగొట్టుకుంటే మాత్రం దీర్ఘకాలంలో నష్టాన్ని ఎదుర్కొక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, తనకు బెదిరింపులు వస్తున్న విషయాన్ని నాగేశ్వర్ లోకేష్ తో చెప్పారట. మరి దీనిపై లోకేష్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.