Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. రెండో ఏడాది పాలనపై ప్రజలు అనేక అంచనాలు పెట్టుకున్నారు. ఆమేరకు పాలన అందించలేకపోయినా.. పార్టీకి ఈ ఏడాది కూడా బాగా కలిసి వచ్చింది. 2025లో ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకం ప్రారంభించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. దీంతో పార్టీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు అన్న భావన హస్తం నేతల్లో నెలకొంది.
వాగ్దానాల అమలు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం 2025 ప్రారంభంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. మొదట స్థలం ఉండి ఇల్లు లేనివారిని ఎంపిక చేశారు. నియోజకవర్గానికి 3500 చొప్పున 119 నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. దీంతో లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తోంది. ఇదే ఏడాది కొత్త రేషన్‌కార్డుల జారీ మొదలు పెట్టారు. 2024లో దరఖాస్తులు స్వీకరించినా.. జారీ మాత్రం ఈ ఏడాది మొదలైంది. అర్హులందరికీ కార్డులు జారీ అయ్యాయి. దీంతో రేవంత్ సర్కార్‌పై సానుకూలత నెలకొంది. అయితే సన్నవడ్ల బోనస్ యాసంగిలో ఇవ్వలేదు. ఇక మహిళలకు రూ.2,500 నగదు, పింఛన్ల పెంపు హామీ నెరవేరలేదు.
మహిళలకు ఇందిర మహిళా శక్తి..
ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు చేశారు. మహిళా సంఘాలకు క్యాంటీన్లు, బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఇచ్చారు. మహిళల ఆర్థిక శక్తి పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో మహిళా సంఘాల్లో రూ.2,500 ఆర్థికసాయం అందలేదన్న ఆలోచన కలుగడం లేదు. ఇక ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ పథకాలు అమలవుతున్నాయి.
ఎన్నికల్లో విజయం..
2025లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్‌ఎస్ స్థానం అయిన జూబ్లీహిల్స్‌లో హస్తం పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమష్టిగా పనిచేసి విజయం సాధించారు. ఇక డిసెంబర్‌లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.
బీసీ రిజర్వేషన్లకు విఫల యత్నం
స్థానిక సంస్థల్లో బీజీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదం తెలుపలేదు. దీంతో చట్టరూపం దాల్చలేదు. అయినా రేవంత్ సర్కార్ జీవో ద్వారా రిజర్వేషన్ల అమలుపై జీవో ఇచ్చింది. అయితే దీనిని కోర్టులు కొట్టేశాయి. దీంతో రేవంత్ సర్కార్ ప్రయత్నించింది అన్న భావన బీసీల్లో నెలకొంది. దీంతో పంచాయతీ ఎన్నికలోల సానుకూల ఫలితాలు వచ్చాయి.
ఎమ్మెల్యేల అనర్హతపై కీలక నిర్ణయం..
ఇక బీఆర్‌ఎస్ నుంచి గెలిచి. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ పూర్తి చేశారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వివరణ తీసుకున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా 8 మంది వివరణ ఇచ్చారు. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ బీఆర్‌ఎస్ ఫిర్యాదులను కొట్టేశారు. మరో ముగ్గురి విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
మొత్తంగా 2025 హస్తం పార్టీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎన్నికల్లో విజయాలు. పథకాల అమలులో జాప్యం జరిగినా వ్యతిరేకత లేకపోవడం, పాలన సాఫీగా సాగిపోవడంతో రేవంత్‌రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు.