Kalvakuntla Kavitha : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన క్రమంలో ఆయా వర్గాల్లోని మహిళలు, యువత మద్దతు కూడగట్టే లక్ష్యంతో 2007లో కవిత తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్), జేఏసీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జాగృతి తరఫున ఆమె క్రియాశీలకంగా పాల్గొన్నారు. సుమారు దశాబ్ద కాలం పాటు బతుకమ్మను విశ్వవ్యాప్త చేసే లక్ష్యంతో పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2020లో అప్పటి సిట్టింగ్ సభ్యుడు ఆర్.భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన తర్వాత జరిగిన ఉపఎన్నికలో కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2021 డిసెంబర్‌లో మండలికి జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో కవిత అదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొంతకాలం ఈమె మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వేదికగా ఉద్యమించారు. అనంతరం మద్యం కుంభకోణ ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఆమెను ఈడీ అరెస్టు చేసింది. ఆగస్టులో బెయిల్‌పై విడుదలయ్యారు. కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ బీసీ నినాదంతో ముందుకు వచ్చారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ లక్ష్యమంటూ..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో ఆమె ఇటీవల 40 బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని లేకపోతే ఎన్నికలు జరగనివ్వమని స్పష్టం చేశారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు హస్తం పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పూలే జయంతి సందర్బంగా జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘బీసీ’ నినాదంతో మరోసారి తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందా అనేది త్వరలో తెలియనుంది. మరోవైపు అధికార పార్టీ నుంచి ప్రభుత్వ పెద్దలు మాత్రం బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.గతంలో ఎన్నికల ముందు కూడా ఇలాగే బీసీ బంధు అంటూ డ్రామా చేశారని విమర్శిస్తున్నారు.
కపట ప్రేమ అంటున్న ‘ఆది’
బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత హడావుడి చేస్తున్నారని, అసలు బీసీలతో ఆమెకు ఏం సంబంధం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తాజాగా ప్రశ్నించారు.