Telangana BJP Leaders: దాపరికమేమీ లేదు. దాచినంత మాత్రాన దాగదు. భారతీయ జనతా పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి అనేది నిజం. అందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా వారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారే.. ఇప్పుడు ఎంపీలుగా ఉన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, గోడం నగేష్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వంటి వారంతా ఇతర పార్టీల లో గతంలో పనిచేసినవారే. రాజకీయ కార్యశాల కోసం వారు తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారు.
ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఇటీవల మాటల తూటాలు బయటికి వచ్చాయి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఏమన్నారో తెలియదు గాని.. ఈటల రాజేందర్ అన్న మాటలు మాత్రం మీడియాలో సంచలనంగా మారాయి. కొన్ని మీడియా సంస్థలు ఈటెల రాజేందర్ వ్యాఖ్యల పట్ల సమయమనం పాటించగా.. ముఖ్యంగా గులాబీ అనుకూల మీడియా సంస్థలు మాత్రం మొహమాటం లేకుండా ఆ మాటలు అన్నది బండి సంజయ్ ని ఉద్దేశించే అని చెప్పేశాయి. ఇద్దరి మధ్య ఏకంగా వార్ నడుస్తోందని.. 8 మంది పార్లమెంటు సభ్యులను తెలంగాణ నుంచి గెలిపించి పంపిస్తే.. చివరికి వారు చేస్తోంది ఇది అని రాసింది. ఇంత జరిగిన తర్వాత తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఒక సర్కులర్ జారీ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎవరూ మాట్లాడవద్దని.. అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆ యుద్ధానికి తాత్కాలిక ముగింపు మాత్రమే ఆయన ఇచ్చారు..
Also Read: సీఎం కుర్చీ కోసం రహస్య మంతనాలు.. ఈటలపై సంచలన ఆరోపణలు!
ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని అనుచరులు కూడా సైలెంట్ అయిపోయారు.. ఆ తర్వాత బోనాల వేడుకలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి భోజనం కూడా చేశారు. ఒకానొక దశలో ప్రీతి రెడ్డి బిజెపిలో చేరుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. దానిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు భేటీ అయ్యారు. వీరిలో డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, గోడం నగేష్, ధర్మపురి అరవింద్, విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ, కరీంనగర్ ఎంపీ ఇందులో కనిపించలేదు.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వీరంతా కూడా ఢిల్లీలో ఉన్నారు.
విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ విప్ గా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యులకు ఢిల్లీలోని ఆయన తన అధికారిక గృహంలో విందు కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కిషన్ రెడ్డి సౌమ్యుడు కాబట్టి.. ఆయన గురించి పెద్దగా ప్రస్తావన ఉండడం లేదు.. కానీ ఎటొచ్చీ బండి సంజయ్ గురించే చర్చ నడుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కి మిగతా ఎంపీలకు మధ్య గ్యాప్ ఉందని.. అందువల్లే ఆయనను విశ్వేశ్వర్ రెడ్డి పిలవలేదని కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు పార్టీలో ఎంపీలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కి అంతరం పెరిగిపోయిందని.. ఈటెల రాజేందర్ కు మిగతా ఎంపీల సపోర్టు ఉందని.. అందువల్లే ఈ ఫోటోలు బయటికి వచ్చాయని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విభాగం స్పందించే లోగానే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది.. వివరణ ఇచ్చే లోగానే వ్యతిరేక ప్రచారం జోరందుకుంది.
8 మంది పార్లమెంట్ సభ్యులను గెలుచుకొని.. అసెంబ్లీ ఎన్నికల్లో పర్వాలేదు అనుకునే స్థాయిలో సీట్లు సాధించుకొని.. కొన్ని జిల్లాలలో పట్టు సాధిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇలా అంతర్గత లుకలుకలతో ఇబ్బంది పడడం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. మరి ఈ పరిణామాలకు రామచంద్రరావు ఎలా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.