CM Revanth Reddy: సోమవారం సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత.. ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల మీద వేటుపడితే తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి.
ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యే అక్కడి అధికార పార్టీలో చేరారు. అతడి వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. అతడి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఒక రకంగా గులాబీ పార్టీకి అనుకూలంగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద గులాబీ పార్టీ పదేపదే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది . దీంతో సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం వారం రోజుల్లో గా తెలంగాణ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ ఎమ్మెల్యేల మీద వేటు వేస్తే.. ఆ స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో కచ్చితంగా ఆ ఎమ్మెల్యేలకు అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇచ్చుకోవడం మాత్రమే కాదు వారిని గెలిపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన జోరు మీద ఉన్న అధికార పార్టీ.. ఈ స్థానాలలో ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష గులాబీ పార్టీ మొదట్లో జోరు చూపించింది.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ఈసారి కూడా గులాబీ పార్టీ గతంలో చేసిన తప్పులను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
2014 నుంచి మొదలుపెడితే 2023 వరకు గులాబీ పార్టీ అనేక పర్యాయాలుగా ఫిరాయింపులను ప్రోత్సహించింది. టిడిపి నుంచి మొదలుపెడితే వామపక్షాల వరకు ఏ పార్టీని కూడా వదిలిపెట్టలేదు. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకుండా కేసీఆర్ చూసుకున్నారు. అయితే ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలని గులాబీ పార్టీ కోరుకుంటుంటే.. అధికార కాంగ్రెస్ కూడా అలానే భావిస్తోంది. ఒకవేళ ఈ స్థానాలలో గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది.
ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయి గులాబీ పార్టీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఉప ఎన్నికల్లో అయ్యే ఖర్చు గులాబీ పార్టీ భరిస్తుందా? జూబ్లీహిల్స్ మాదిరిగా పరిస్థితి ఎదురైతే ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానం లభించాల్సి ఉంది.