India Gold Imports: బంగారం అనేది భారతీయులకు అత్యంత ఇష్టమైన లోహం. ఒకప్పుడు ఆడవాళ్లు మాత్రమే ఆభరణాలుగా బంగారాన్ని ధరించేవారు. కానీ కొంతకాలంగా మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలను ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా భారతీయులు నిర్వహించుకునే వేడుకల్లో బంగారానికి విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. ఇటీవల కాలంలో చాలా కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు అనేది అంతకంతకు రెట్టింపవుతోంది.
Also Read: ఉత్తరాంధ్రలో వారసులు రెడీ!
సాధారణంగా డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వస్తువుల ధర పెరుగుతుంది. పైగా అంతర్జాతీయ మార్కెట్లో విచిత్రమైన పరిస్థితులున్నాయి. ఇవన్నీ కూడా బంగారం ధరను రాకెట్ వేగంతో పెరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర ₹1,30,000 దాటి పరుగులు తీస్తోంది. డాలర్ విలువ పడిపోవడం.. అమెరికాలో షట్ డౌన్.. అరబ్ దేశాలలో ఆర్థిక అస్థిరత్వం.. ఫెడరల్ మార్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించడం వంటి పరిణామాలు బంగారం ధర పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. పైగా ఇటీవల కాలంలో భారత్ లో బంగారం వినియోగం మరింత పెరిగింది. ఈ స్థాయిలో ధరలు పెరుగుతున్నప్పటికీ మన దేశంలో గిరాకీ ఏ మాత్రం తగ్గడం లేదు.. రికార్డు స్థాయిలో మన దేశానికి బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో 14.72 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి అయింది. గత ఎడాది అక్టోబర్ నెల తో పోల్చి చూస్తే దాదాపు మూడు రెట్లు (4.92 బిలియన్ డాలర్లు) అధికం కావడం విశేషం. ఏప్రిల్, అక్టోబర్ నెలల మధ్య 41.23 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోటీ చూస్తే ఇది 21.44 (44 బిలియన్ డాలర్లు) ఎక్కువ. స్విట్జర్లాండ్ నుంచి 40%, యూఏఈ నుంచి 16%, సౌత్ ఆఫ్రికా నుంచి 10 శాతం గోల్డ్ దిగుమతి అవుతోంది.
దేశ అవసరాలకు తగ్గట్టుగా బంగారం ఉత్పత్తి కాకపోవడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మన దేశం అత్యధికంగా విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించే వాటిల్లో చమురు ముందు వరుసలో ఉండగా, బంగారం రెండవ స్థానంలో ఉంది. దేశ అవసరాల పెరుగుతున్న నేపథ్యంలో బంగారాన్ని దిగుమతి చేసుకోక తప్పడం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అయితే ఇదే సమయంలో అక్రమంగా బంగారాన్ని మన దేశానికి తీసుకొచ్చే వారి సంఖ్య పెరిగిపోతుందని.. కస్టమ్స్ అధికారుల తనిఖీలలో భారీగా బంగారం లభిస్తోందని.. వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.