Telangana Congress: రాజకీయాల్లో పరస్పర అవసరాలే ఉంటాయి. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఆ అవసరాలు తీరిన తర్వాత ఎంతటి వారినైనా పక్కన పెట్టేస్తారు. ఉద్యమ సమయంలో కోదండరామ్ ను దగ్గర తీసిన కేసిఆర్ తర్వాత దూరం పెట్టారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ను బండ బూతులు తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను దగ్గరికి తీసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలో అది కూడా ఎన్నికల సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుత సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే విషయాన్ని బలంగా నమ్ముతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడి ప్రజల మనసులను చూరగొనాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకులు తెలంగాణలో గత కొద్దిరోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరవుతున్నారు. తమకు ఉన్న ఈర్ష్యలను, మన స్పర్థలను పక్కన పెట్టి పని చేస్తున్నారు. అయితే ఈ జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన కుద్బుల్లాపూర్ అభ్యర్థి కొలన్ హనుమంత రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఉన్నారు. వీరు గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలో కుత్బుల్లాపూర్ అభ్యర్థిగా హనుమంతు రెడ్డికి అవకాశం దక్కింది. ఈ క్రమంలో హనుమంతు రెడ్డి భూపతిరెడ్డి నివాసానికి వెళ్లారు. తన గెలుపునకు కృషి చేయాలని అభ్యర్థించారు. ఇద్దరం కలిసికట్టుగా పనిచేసే పార్టీ విజయానికి కృషి చేద్దామని హనుమంత్ రెడ్డి భూపతిరెడ్డికి సూచించారు.
భూపతి రెడ్డికి టికెట్ రాకపోవడంతో గత కొంతకాలంగా ఆవేదనతో ఉన్నారు. అయితే ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. ఎన్నికలవేళ ఇది పార్టీకి మంచిది కాదని రేవంత్ రెడ్డి భావించారు. ఆయన వెంటనే రంగంలోకి దిగి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని హనుమంతరావు ద్వారా చెప్పించారు. దీంతో హనుమంత్ రెడ్డి కి మద్దతు ఇస్తానని భూపతిరెడ్డి ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన పోలీస్ సుమిత్ర జివేందర్ రెడ్డి, జ్యోత్స్న శివారెడ్డి, పున్నా రెడ్డిని హనుమత్ రెడ్డి స్వయంగా కలిశారు. తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. దీంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో వర్గ పోరు తగ్గినట్టే అని హనుమంత్ రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంతో భారత రాష్ట్ర సమితిలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా కెపి వివేకానంద గౌడ్ ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్లో వర్గపోరు వల్లే భారత రాష్ట్ర సమితి విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే తాజా పరిణామాలు భారత రాష్ట్ర సమితికి ప్రతిబంధకమేనని వారు అంటున్నారు. మరి కలిసిపోయిన ఈ ప్రత్యర్ధులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? అనేది ఎన్నికలయ్యాక తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.