Crime : భార్యను చంపి 10వేల మందికి భోజనం పెట్టావా? ఏం గుండెరా నీది..!

కట్టుకున్న భార్యను కడతేర్చడమే కాకుండా గుండెపోటు అని నమ్మించి, దశదినకర్మ నిర్వహించడం, అందరితో బాధగా ఉన్నట్లు నటించడం వల్లభ్‌లోని క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. అయితే లహరి పేరెంట్స్ మాత్రం తమ అల్లుడు వల్లభ్‌మంచోడని చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : July 29, 2023 8:33 pm
Follow us on

Crime : నల్గొండ జిల్లా నిడమానురుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డి భార్య లహరి మృతికేసు ఊహించని ట్విస్టులు తిరుగుతోంది. లహరి తల, పెదవిపై తీవ్ర గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పొట్టభాగంలో బలంగా తన్నటం వల్ల ఇంటర్నల్ బ్లెడ్ బ్లీడింగ్ అయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో భార్య హత్య కేసులో భర్త వల్లభ్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

వెలుగులోకి విస్తుపోయే అంశాలు..
పోస్టుమార్టం రిపోర్టుతోపాటు, వల్లభ్‌రెడ్డి విచారణలోనూ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. లహరి మృతిని వల్లభ్‌రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. లహరిరెడ్డి తలను గోడకు, తలుపుకు గట్టిగా బాది పొట్టలో కాలుతో బలంగా తన్నడంతోనే ఆమె మృతి చెదినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా హార్ట్ ఎటాక్ పేరుతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు.

ఏడాదిన్నర క్రితమే వివాహం..
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలానికి చెందిన కాంగ్రెస్‌ నేత యడవల్లి రంగసాయిరెడ్డికి వల్లభ్‌రెడ్డి ఏకైక సంతానం. హైకోర్టు ఉద్యోగి కోతి జైపాల్‌రెడ్డి కుమార్తె లహరిరెడ్డి (27)తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరు హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై 13న ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. ఆ తర్వాత ఆమె చనిపోవటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పొట్టలో రెండున్నర లీటర్ల రక్తస్రావం..
ఈనెల 14న అపోలో ఆసుపత్రి నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. లహరీ నుదిటిపై, పెదవులపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఆమెకు ఎలాంటి మెడికల్ హిస్టరీ లేదు. మ్యారేజ్ అయి కూడా కేవలం ఏడాది మాత్రమే అయింది. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలోపల గాయాలైనట్లు తేలింది. లహరి పొట్టలో వల్లభ్‌రెడ్డి కాలుతో తన్నడంతో పొట్టలో రెండున్నర లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ అయిందని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.

నేరం అంగీకరించిన వల్లభ్‌రెడ్డి..
ఆ ఘటన జరిగినప్పుడు భర్త మాత్రమే ఉన్నాడు. దీంతో పోలీసులు ఈనెల 26న వల్లభ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆ గొడవల్లో లహరి జుట్టుపట్టుకొని డోర్ ప్రేమ్‌కు కొట్టాడు. ఆ తర్వాత ఆమెను పొత్తి కడుపులో తన్నాడు. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ అని ఆసుపత్రిలో చేర్పించానని అంగీకరించాడు. ఈ మేరకు అతడిపై సెక్షన్ 302 మర్డర్, 201 సాక్షాల తారుమారు కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

దశదినకర్మ రోజు 10 వేల మందికి భోజనం..
లహరిరెడ్డికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. జూలై 24న దశదినకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 వేల మందిని పిలిచి భోజనాలు పెట్టాడు. చివరకు పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది హత్య అని తేలటంతో వల్లభ్‌రెడ్డి అసలు స్వరూపం బయటపడింది. కట్టుకున్న భార్యను కడతేర్చడమే కాకుండా గుండెపోటు అని నమ్మించి, దశదినకర్మ నిర్వహించడం, అందరితో బాధగా ఉన్నట్లు నటించడం వల్లభ్‌లోని క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. అయితే లహరి పేరెంట్స్ మాత్రం తమ అల్లుడు వల్లభ్‌మంచోడని చెబుతున్నారు. భార్యభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని.. తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పటం కొసమెరుపు.