https://oktelugu.com/

Telangana Caste Census : కులగణన సర్వేపై ఇంత రాద్ధాంతం ఎందుకో…?

కుల గణనతో ఏవో కొంపలు అంటుకపోయినట్లు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ లబ్ధిపొందాలను కునే పార్టీల వాదనను బలపర్చడం తగదు.

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2024 9:51 am

    Telangana Caste Census

    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే ప్రారంభమైంది. ఈ విషయంలో ప్రధాన విపక్షాలు ఏదో విధంగా రాష్ట్రంలో తమ ఉనికి చాటుకునేందుకు, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ లో ఇలాంటి సర్వే సకల జనుల సర్వే పేరుతో నిర్వహించారు. అప్పుడు ఆ సర్వేను అందరూ రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించారు. ఇప్పుడు మాత్రం దీన్ని కేవలం రాజకీయ ప్రాపకం కోసం ఒక సాకుగా తీసుకొని వ్యతిరేకించడం కనిపిస్తోంది.. ఈ విషయంలో సాధారణ జన బాహుళ్యం ఏవిధంగా స్పందించాలో చర్చిద్దాం..

    ముస్లింలు, క్రైస్తవులే కాకుండా ఇంకా ఎన్నో మతాలకు చెందిన వారు ఈ రాష్ట్రంలో, దేశంలో జీవనం సాగిస్తున్నారు.
    రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మిగతా మతాల్లో ఎన్ని వర్గాలున్నా వారందరు తారతమ్యాలు లేకుండా జీవనం సాగించారు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే హిందువుల్లో మాత్రమే కులాల ప్రాతిపదికన విభజనకు ఆస్కారమిచ్చింది మనమే.
    వృత్తిపరంగా వివిధ వర్గాలుగా ఉన్న వారిని వారి మాదిరిగా కలుపుకునే భావన మనలో ఇప్పటికీ లేకపోవడమే అందుకు కారణం..
    వృత్తులు మరిచి కులంగా రూపాంతరం చెంది ఎవరికి వారే తామే గొప్పవారమని మిగతా వృత్తులు చేసుకునేవారు మాకంటే తక్కువ అనే భావనతో వృత్తులనే కులాలుగా విభజించేలా వ్యవహరించడం వల్లనే కదా ఈ పరిస్థితి.
    దీన్ని ఆధారంగా చేసుకొని
    ప్రారంభంలో
    హిందువుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని వర్గాలుగా విభజన చేసేందుకు ఆస్కారం కల్పించింది ఎవరు..?
    కొన్ని వర్గాలను అంటరాని వారుగా చిత్రికరించి దూరంగా ఉంచడంలో ఆంతర్యాలు ఏమైనా వాటిని ప్రాతిపదికగా చేసుకొని కుల విభజన జరిగిందనేది నిర్వివాదాంశం.
    దానిని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కానీ ఈ చాత్రు వర్ణాల్లో కూడా వివిధ తెగలుగా విభజన మొదలయింది. ఇప్పుడు లెక్కకు మించి కులాలు తమ ఉనికి కోసం పోరాటం సాగిస్తున్నాయి. వీటన్నిటికీ కారణం రిజర్వేషన్లు. ప్రస్తుతం ఇవి కేవలం విద్య, ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రక్రియ.

    ఎందుకు ఈ సర్వే…?
    ఎవరిది ఏ కులం వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితి ఏంటి.. ఏ విధంగా వారిని ఉద్ధరించేందుకు ఆస్కారం ఉంది. వారి పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఏ పథకాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది.
    వివిధ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏ విధంగా తోడ్పడేందుకు అవకాశం ఉంది అనే విషయాల్లో జరిగే సర్వే మాత్రమే ఈ కుల గణన.

    హిందువులను కాపాడుకోవాలంటే మొదట కులవైషమ్యాలను పక్కన పెట్టాలి.

    కులాన్ని కాపాడుకోవాలంటే తెగల మధ్య సయోధ్య కుదరాలి.

    గడప లోపలే నీ కులం..
    గుడిలోనే నీ మతం..
    గడప దాటితే భారతీయులం అనే భావన అందరిలో కలిగేలా వ్యవహరించాలి.

    కుల గణనతో ఏవో కొంపలు అంటుకపోయినట్లు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ లబ్ధిపొందాలను కునే పార్టీల వాదనను బలపర్చడం తగదు.

    -దహగాం శ్రీనివాస్, జర్నలిస్ట్