Karimnagar Congress MLC candidate : గత కొద్ది నెలల నుంచి నరేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ఫోర్స్ విద్య సంస్థలు 56 బ్రాంచ్లను కలిగి ఉన్నాయి. ఇందులో సుమారు లక్షన్నరకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. 4,000 మంది ఉపాధ్యాయులు వీరికి పాఠాలు బోధిస్తున్నారు. అయితే తన గెలుపును నరేందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి.. ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అయితే ఓ పత్రికలో నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా కథనం ప్రచురితమైంది. “నరేందర్ రెడ్డి ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్న వారికి ఓటర్ల నుంచి వింత అనుభవం ఎదురవుతోంది.. కాల్ సెంటర్ల నుంచి ఫోన్ చేసే వారికి ఓటర్లు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇస్తున్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎన్నడూ మా పిల్లలకు స్కూల్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వలేదు. కాలేజీ ఫీజు తగ్గించలేదు. కనీసం ఆయనను కలవాలని చాలాసార్లు ప్రయత్నించాం. ఎప్పుడు కూడా అనుమతి ఇవ్వలేదు. అటువంటి వ్యక్తికి మేము ఎందుకు ఓటు వేయాలి. మేము మాత్రమే కాదు, మిగతావారు కూడా ఓట్లు వేయొద్దు. విద్యను వ్యాపారం చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ అయితే ప్రయోజనం ఏముంటుంది? కార్పొరేట్ కళాశాలలకు మాత్రమే నరేందర్ రెడ్డి పనికొస్తారు. అంతేతప్ప విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ఆయన చొరవ చూపరు” అంటూ పట్టభద్రులు విమర్శలు చేశారని ఆ పత్రిక తన కథనంలో స్పష్టం చేసింది.
ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం ఉపయోగం?
“నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం ఉపయోగమంటూ పట్టభద్రులు ప్రశ్నిస్తున్నారు. నరేందర్ రెడ్డి కార్యాలయం లో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ టెలి కాలర్స్ కు పట్టభద్రుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతోంది. కార్పొరేట్ విద్య వ్యాపారం చేసే వ్యక్తి విద్యారంగ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? అసలు ఆయన ఎమ్మెల్సీగా గెలిచి ఏం చేస్తారు? ఆయనను కచ్చితంగా ఓడిస్తాం. మేము ఆయనకు ఓటు వేయం. ఇంకొక లను వేయనీయం. మా పిల్లలు ఆయన విద్యాసంస్థలోనే చదివారు. కనీసం ఒక్క రూపాయి కూడా ఫీజు తగ్గించలేదు. ప్రతి సందర్భంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేశారు. నాణ్యమైన విద్య లభిస్తుందనే ఆయన విద్యాసంస్థల్లో చేర్పించాం. కానీ ఆయన విద్య పేరుతో వ్యాపారం చేశారు. అలా వ్యాపారం చేసి కూడగట్టిన డబ్బులతోనే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అత్యంత కాస్ట్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.. ఇవన్నీ కూడా విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేసే పనులు కావు కదా.. కళ్ళ ముందు ఇంత కనిపిస్తున్నప్పుడు ఆయనకు ఓటు వేయాలని మీరు ఎందుకు అడుగుతారు.. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే విద్యారంగ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి. ఆయన ఓటమికి మేము కృషి చేస్తామని” పట్టభద్రులు అంటున్నారని ఆ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది.. కాల్ సెంటర్లకు పట్టభద్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. వారంతా కూడా అదే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్టు తెలుస్తోందని ఆ పత్రిక రాసింది. పట్టభద్రుల నుంచి ఇలాంటి వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో నరేందర్ రెడ్డి తన రూట్ మార్చుకుంటారా? గెలుపు కోసం సరికొత్త పంథా అనుసరిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉందని ఆ పత్రిక తన కథనంలో వివరించింది.