Revanth Reddy and Komatireddy: ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రివర్గంలో మరో కొత్త పంచాయతీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి మధ్య విభేదాలు ఉండేవి. వీరి మధ్య సాగిన విభేదాలు వివాదాలుగా మారాయి. వీరి మధ్య ఉన్న గ్యాప్ ఏకంగా హై కమాండ్ దాకా వెళ్ళింది.. హై కమాండ్ చర్చించి పంపించిన తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది.
ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రాగానే సినీ కార్మికులతో సభ నిర్వహించారు.. సినీ కార్మికులు ముఖ్యమంత్రి కి సన్మానం కూడా చేశారు. ఈ క్రమంలో కార్మికులకు 20% అదనపు జీతాలు ఇస్తేనే టికెట్ రేట్ల పెంపుదల గురించి ఆలోచిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత కార్మికులు ముఖ్యమంత్రిని సన్మానించారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి కామెంట్ చేయలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాట మీడియాలో ప్రముఖంగా ప్రచారం కావడంతో విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ టాక్ రావడంతో కార్యకర్తలు సంతోషంతో ఉన్నారు.
ఈ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం జరిగినప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేరు. ఆయన ముంబైలో ఉన్నారు. ఇటీవల వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరును ఎండ గడుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి జాబితాలోకి వెంకటరెడ్డి చేరినట్టు కనిపిస్తోంది. తాను లేకుండా కార్మికులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడాన్ని వెంకటరెడ్డి తప్పు పట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ఆవేదనను అంతరంగికుల వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే తనకు, ముఖ్యమంత్రికి ఓ షాడో మంత్రి గ్యాప్ పెంచుతున్నట్టు వెంకటరెడ్డి వాపోయినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ వ్యక్తి మంత్రివర్గంలో కీలకంగా మారారు. అలాగని ఆయన మంత్రి కాదు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ కూడా ఆయనకు ఇవ్వలేదు. కాకపోతే ఒక క్యాబిన ర్యాంకు పదవి ఇవ్వడంతో ఆయన పెత్తనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన వల్లే వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగినట్టు సమాచారం. కార్మికులతో సమావేశం నిర్వహించినప్పుడు ఆ షాడో మంత్రి కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లలో చర్చ కూడా నడుస్తున్నట్టు గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.