High Court Judge : ఇటీవల అమీన్ పూర్ ప్రాంతంలో హైడ్రా ఓ భారీ భవంతిని పడగొట్టింది. ఆ భారీ భవంతి యజమాని హైకోర్టుకు వెళ్ళాడు. హైడ్రా కూల్చివేతలకు పాల్పడకుండా చూడాలని కోర్టుకు విన్నవించాడు. దీంతో హైకోర్టు ఎలాంటి కూల్చివేతలకు పాల్పడకుండా స్టే విధించింది. అయితే హైకోర్టు స్టే అలా ఉండగానే హైడ్రా ఆ భవనాన్ని పడగొట్టింది. దీనిని సవాల్ చేస్తూ ఆ భవన యజమాని హైకోర్టుకు వెళ్ళాడు. దీంతో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని హైడ్రా అధిపతి రంగనాథ్ ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రంగనాథ్ హైకోర్టు ఎదుట విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హైడ్రా పనితీరును తప్పుపట్టారు. ” కేవలం సెలవు రోజుల్లోనే ఎందుకు భవనాలను పడగొడుతున్నారు? అలా చేయమని మీకు చెప్పింది ఎవరు? మీ పొలిటికల్ బాస్ లను సంతృప్తి పరచడానికి పనిచేయకండి. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మీరు ఎలా ఆ భవనాన్ని పడగొడతారు? ఇలా పడగొట్టుకుంటూ పోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే మిమ్మల్ని జైలుకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త.. తహసీల్దార్ చెబితే చేశామని అంటున్నారు. అదే తహసీల్దార్ చెబితే చార్మినార్ ను పడగొడతారా? హైకోర్టును కూల్చివేస్తారా” అంటూ న్యాయమూర్తి రంగనాథ్ ను ప్రశ్నించారు.
యూట్యూబ్లో సంచలనం..
న్యాయమూర్తి, రంగనాథ్ మధ్య సాగిన విచారణకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు రంగనాథ్ నీళ్లు నమలడం ఈ వీడియోలో కనిపించింది. మొన్నటిదాకా హైడ్రా పని తీరుపై గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం.. న్యాయమూర్తి ఏకిపారేయడంతో అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది. దీనిపై భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రంగనాథ్ ను కాదు, రేవంత్ రెడ్డిని విచారించాలని.. అప్పుడే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అయితే వారికి కాంగ్రెస్ పార్టీ అనుకూల నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ” ధరణి లో స్కామ్ జరిగింది. పౌరసరఫరాల శాఖలో స్కాం జరిగింది. గొర్రెల స్కీంలో స్కాం జరిగింది. ఇలా చెప్పుకుంటే గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పరిపాలన మొత్తం కుంభకోణాల మయమే. ఇప్పటికే చాలామంది అధికారులు జైల్లో ఉన్నారు. అలాంటి పరిపాలన సాగించిన భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు కొత్తగా నీతి వాక్యాలు వల్లించడం ఏంటని” కాంగ్రెస్ అనుకూల నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా రంగనాథ్ ను న్యాయమూర్తి విచారించిన తీరుకు సంబంధించిన వీడియోను భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుండగా.. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ అనుకూల నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.