https://oktelugu.com/

Rythu Runamafi : రేపటి నుంచి రెండో దశ రుణమాఫీ.. కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రూ.1.50 లక్షల వరకు మాఫీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌రెడ్డి సర్కార్‌.. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చసింది. రెండో విడత రుణమాఫీకి కసరత్త ప్రారంభించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 29, 2024 1:40 pm
    Follow us on

    Rythu Runamafi : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల హామీతోపాటు 420కిపైగా హామీలను మేనిఫెస్టోలు పేర్కొంది. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే ఎల్‌పీజీ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అమలవుతున్నాయి. ఇక ఆరు గ్యారంటీల్లో ప్రధానమైనది రైతు రుణమాఫీ. ఎన్నికల సమయంలో రైతులకు సంబంధించి పంట రుణాలు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే లోక్‌సభ ఎన్నికలు రావడంతో రుణమాఫీ ప్రక్రియ వాయిదాపడింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పంట రుణాలు మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు ప్రకటించారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్‌ చేశారు. రేవంత్‌రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో దీనినే ప్రధానంగా ప్రచారం చేశారు. ఎన్నికలు ముగియగానే రుణమాఫీ ప్రక్రియపై రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. మూడు విడతల్లో రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతగా రూ.లక్ష లోపు రుణాలు, రెండో విడతలో రూ.1.50 లక్షల రుణాలు.. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు.

    మొదటి విడత రుణమాఫీ పూర్తి..
    మొదటి విడత రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి జూలై 18న చేశారు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో సుమారు రూ.6 వేల కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రుణ మాఫీ అయిన రైతులు కొత్త రుణాలు తీసుకోవచ్చని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బ్యాంకర్లు కూడా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అవసరమైన రైతులకు కొత్త రుణాలు ఇస్తామని చెబుతున్నారు.

    రేపటి నుంచి రెండో విడత..
    ఇక రెండో విడత రుణమాఫీలో భాగంగా జూలై 30న(మంగళవారం) రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా రెండో విడత రుణమాఫీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం(జూలై 30న) మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి రెండో విడత రుణమాఫీ ప్రక్రియలో భాగంగా బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

    రుణమాఫీపై ప్రత్యేక సమావేశం..
    రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తర్వాత నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని కలెక్టరేట్లలో రుణమాఫీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లతోపాటు ఆయా జిల్లాల వ్యవసాయశాఖ, సహకారశాఖ అధికారులు, అర్హులైన కొంతమంది రైతులు పాల్గొంటారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని విన్న అనంతరం ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లాలకు చెందిన కలెక్టర్లు రెండో విడత రుణమాఫీ సంబరాలను రైతుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు.