CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) ఏడాది పాలనను విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. మొదటి ఏడాదిలో కొన్ని హామీలు నెరవేర్చారు. ఇప్పుడు అసలు పరీక్ష ఎదుర్కొంటున్నారు. నెరవేరని హామీలు, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.
Also Read: రాటుదేలుతున్న లోకేష్.. ఆ విషయంలో చాలా మెచ్యూర్డ్‌గా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదు. కేవలం మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తున్నారు. మహిళలకు రూ.2,500 ఇవ్వడం లేదు. విద్యార్థులకు రుణ కార్డులు ఇవ్వలేదు. విద్యార్థినులకు స్కూటీలు లేవు. పింఛన్లు పెరగలేదు. ఇంకా అనేక హామీలు అలాగే ఉన్నాయి. మరోవైపు ఎలాంటి అభివృద్ధి కనిపించండం లేదు. ఈ తరుణంలో శుక్రవారం(మార్చి 7న) ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ తాజ్ ప్యాలెస్(Taj Pales)లో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ 2025లో పాల్గొన్నారు. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కాంక్లేవ్‌లో ఆయన చర్చలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
డిలిమిటేషన్‌పై బీజేపీ వైఖరి:
రేవంత్ రెడ్డి బీజేపీని డిలిమిటేషన్ ద్వారా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘బీజేపీ దక్షిణ రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ ఆయుధం ద్వారా దక్షిణ రాష్ట్రాలను బలహీనపరచాలని భావిస్తోంది,‘ అని విమర్శించారు. ఈ విషయంపై సమగ్ర చర్చ కోసం అన్ని పార్టీల సమావేశం జరపాలని కేంద్రాన్ని కోరారు.
హిందీ బలవంతం వద్దు:
హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని, అది జాతీయ భాష కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మోదీజీ హిందీ(Modi Ji) కోసం ఎంతో కృషి చేస్తున్నారు, కానీ తెలుగు రెండో అతిపెద్ద భాషగా ఉంది. దాని కోసం ఏం చేశారు?‘ అని ప్రశ్నించారు. భాష నేర్చుకోవడం ఐచ్ఛికంగా ఉండాలని, కళాశాలల్లో ఫ్రెంచ్, జర్మన్ లాంటి ఎంపికలు ఉన్నట్లే హిందీ కూడా అలాగే ఉండాలని సూచించారు.
తెలంగాణ VS గుజరాత్ మోడల్:
గుజరాత్ మోడల్‌ను టెస్ట్ మ్యాచ్‌తో, తెలంగాణ మోడల్(Telangana Model)ను టీ20తో పోల్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ‘గుజరాత్(Gujarath) మోడల్‌లో సంక్షేమం లేదు, కానీ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మంచి పాలన మూడూ ఉన్నాయి,‘ అని రేవంత్ రెడ్డి వివరించారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అప్పుల భారం:
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, గత ప్రభుత్వం (కేసీఆర్ హయాంలో) రూ.69,000 కోట్ల అప్పును రూ.7 లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుంది తెలిపారు. కానీ రూ.6,500 కోట్లు జీతాలు, పెన్షన్లకు, మరో రూ.6,500 కోట్లు అప్పు చెల్లింపులకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేదని వెల్లడించారు. భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్యారంటీలపై చర్చ అవసరం:
ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ(Six Garantees) హామీలు, ఉచిత సేవలపై జరుగుతున్న చర్చలను స్వాగతిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై స్పష్టమైన చర్చ జరగాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘ఒక గదిలో ఒకటి మాట్లాడి, బయట వేరే విధంగా మాట్లాడకూడదు,‘ అని ఆయన వ్యాఖ్యానించారు.
మైనారిటీల ప్రాతినిధ్యం:
కేంద్ర మంత్రిమండలిలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ, ‘స్వాతంత్య్ర సమరంలో వారు పాల్గొనలేదా? ఇది అన్యాయం,‘ అని బీజేపీని విమర్శించారు.
Also Read: ఒకనాడు తిట్టుకున్నారు.. ఇప్పుడు కలిసి నామినేషన్ వేశారు..వైరల్ అవుతున్న లోకేష్-నాగబాబు ఫోటో!