Telangana Politics : రాజకీయమంటేనే అధికారం.. అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయ నాయకులు ఎత్తులు వేస్తుంటారు. ఒక్కోసారి ఈ ఎత్తులు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. రాజకీయ పరమపద సోపానంలో కిందకి దిగజారనూ వచ్చు. అయితే కొంతమంది నాయకులు ఈ జాబితాలో ఉండరు. వారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. పార్టీ మారిన ప్రతిసారీ ఏదో ఒక మంత్రదండాన్ని దక్కించుకుంటారు. ఈ జాబితాలో కొంతమంది నాయకులు ముందు వరసలో ఉంటారు. అయితే వారి అనుచరులు ఈ విషయాన్ని కొట్టి పారేస్తుంటారు. తమ నాయకుడికి రాజకీయంగా బలం ఉంది కాబట్టే పార్టీలు ఆహ్వానిస్తుంటాయని చెబుతుంటారు.తెలుగు రాష్ట్రాలలో.. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన రాజకీయ ప్రస్తానాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. నాడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా నాలుగు సార్లు ఆయన శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలను తుమ్మల నాగేశ్వరరావు శాసించారు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితం కూడా మార్పునకు గురైంది. అప్పటిదాకా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి.. ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరడం ఒకరకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. అయినప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ముందుగా కెసిఆర్ తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గం లో ఉప ఎన్నిక రావడంతో.. అక్కడ పోటీ చేసి తుమ్మల విజయం సాధించారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో పాలేరు స్థానం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. అదే సమయంలో ఖమ్మం స్థానం నుంచి గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితం ఆటుపోట్లకు గురైంది.
కాంగ్రెస్ పార్టీలో చేరారు..
తుమ్మల నాగేశ్వరరావుకు భారత రాష్ట్ర సమితి అధిష్టానం సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. తుమ్మల అనుచరులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. చివరికి తుమ్మలకు పాలేరు టికెట్ దక్కకుండా పోయింది. దీంతో ఆయన 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు నుంచి కాకుండా ఖమ్మం నుంచి ఆయన పోటీ చేశారు. 2014లో తనపై గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ పై తుమ్మల నాగేశ్వరరావు 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తుమ్మల రాజకీయ జీవితం నాలుగు దశాబ్దాలు అయితే.. అందులో ఆయన మూడు రాజకీయ పార్టీలు మారారు. పార్టీ మారినప్పుడల్లా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఓటములు కూడా చవి చూశారు. మూడు పార్టీలలోనూ ఆయన మంత్రిగా పనిచేసే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతిసారి.. తుమ్మల తన చాకచక్యంతో ముందడుగు వేశారు. ఫలితంగా తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావు స్థాయిలో తనకంటూ కేడర్ ఏర్పరచుకున్నారు. అందువల్లే ఆజాతశత్రువుగా ఎదిగారు. మూడు పార్టీలలోను మంత్రిగా పనిచేయడం తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రమే చెల్లింది.