Telangana Assembly Election 2023: అడుగడుగునా ఖాకీ నిఘా. ఎక్కడికక్కడ తనిఖీ కేంద్రాలు. భారీగా డబ్బు స్వాధీనం చేసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు.. అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డేగ కళ్ళతో కాపలా కాస్తున్నారు. అంతేకాదు హవాలా రూపంలో సహర్రుతున్న నగదును కూడా పట్టేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ మొత్తం ఇప్పుడు పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. కేంద్ర బలగాల పహారాలోకి మారిపోయింది. ఫలితంగా ఒకప్పుడు పోలీసుల సెక్యూరిటీతో బయటికి వెళ్ళే నేతలు సైలెంట్ అయిపోయారు. వారి అనుచరులను కూడా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు.
ఎన్నికల విధులకు 70 వేల మంది పోలీసులు
ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల బందోబస్తుకు 65 నుంచి 70 వేల మంది పోలీసు సిబ్బంది అవసరమని ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. పోలీసింగ్‌లో రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యే వారు కాకుండా ఎన్నికల విధుల కోసం రాష్ట్రంలో 40 వేల మంది పోలీసులు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. వీరికి తోడు ఎక్సైజ్, అటవీ శాఖల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఎన్నికల బందోబస్తుకు వినియోగించనున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి 20 వేల మంది పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నారు. ఇక కేంద్ర పారా మిలటరీ బలగాల విషయంలోనూ 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మరింత ఎక్కువ ఫోర్స్ అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు కేంద్రానికి నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో 275 కంపెనీల కేంద్ర బలగాలు రాగా ఈ సారి 325 కంపెనీలు అవసరమని కోరారు. సుమారు 300 కంపెనీలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్తగా శిక్షణలో చేరిన ఎస్సై అభ్యర్థులు, త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న కానిస్టేబుల్ అభ్యర్థుల సేవలను వినియోగించుకునే అంశాన్నీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.
టీఎస్ పీఏలో సుమారు 500 మంది ఎస్సైలు అభ్యర్థులు శిక్షణలో ఉన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థుల తుది జాబితా ఇటీవలే వెలువడింది. వారి శిక్షణ ప్రారంభం కావాల్సి ఉంది. కనీసం 15 రోజులు శిక్షణ పూర్తైనా వారి సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇక సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ల సేవల్ని వినియోగించుకునే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పోలీసు శాఖలో సెలవులు రద్దు చేశారు. కాగా, సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాల పరిధిలో ఎక్కడికక్కడ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల వేళ సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు. గత ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా కొనసాగిస్తున్నారు. పోలీసింగ్‌లో ఈ రెండు నెలలు అత్యంత కీలకంగా మారనున్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.